పొట్ట నుంచి పుట్టిన రెండు కాళ్లు తొలగింపు : 17 ఏళ్ల నరకయాతనకు విముక్తి

పొట్ట నుంచి పుట్టిన రెండు కాళ్లు తొలగింపు : 17 ఏళ్ల నరకయాతనకు విముక్తి

కోటి మందిలో ఒక్కరికి మాత్రమే ఇలా జరుగుతుంది.. ప్రపంచంలో ఇప్పటి వరకు 42 మందికి మాత్రమే ఇలా జరిగింది.. పొట్ట నుంచి రెండు కాళ్లు పుట్టుకురావటం.. అంటే అతనికి నాలుగు కాళ్లు.. రెండు కాళ్లు అందరికీ ఉన్నట్లే అంటే.. మరో రెండు కాళ్లు మాత్రం పొట్ట నుంచి వచ్చాయి. ఈ నాలుగు కాళ్లతో 17 ఏళ్లు నరకయాతన అనుభవించాడు ఆ పిల్లోడు.. ఎట్టకేలకు.. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం.. విజయవంతంగా ఆపరేషన్ చేసి.. పొట్ట నుంచి వచ్చిన రెండు కాళ్లను తొలగించింది. ఆపరేషన్ విజయవంతం.. బాలుడు సంపూర్ణ ఆరోగ్యం.. ప్రపంచంలోనే అరుదైన శస్త్రచికిత్సగా చెప్పుకొచ్చారు ఆపరేషన్ బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ అసూరి కృష్ణ. ఆయన మాటల్లోనే ఈ అరుదైన.. వింత గురించి తెలుసుకుందాం..

‘‘జనవరి 28న నడుముకు ఒక బట్ట కట్టుకుని, రెండు కాళ్లు బయటకు వేళాడుతూ పదిహేడేళ్ల బాలుడు ఓపీ తీసుకున్నాడు. నడుముకు చుట్టిన గుడ్డను తీసిన తర్వాత తెలిసింది.. అతని రెండు కాళ్లు పొట్టలో నుంచి ఉన్నాయి. అతన్ని నాలుగు కాళ్ల పిల్లాడు అనవచ్చు. అయితే మెడికల్ టర్మినాలజీలో అతడు అసంపూర్తిగా పుట్టిన అవిభక్త కవలగా చెప్పవచ్చు’’నని బాలుడి కండిషన్ గురించి డాక్టర్ కృష్ణ తెలిపారు. 

వైద్య చరిత్రలోనే అరుదైన సర్జరీ చేసి బాలుడికి ఉపశమనం కల్పించారు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం. రెండున్నర గంటలు తీవ్రంగా శ్రమించి సర్జరీ చేసి పొట్టలో ఉన్న రెండు కాళ్లను తొలగించారు డాక్టర్లు. డా. అసూరి కృష్ణ ఆధ్వర్యంలోని   డా.వికె. భన్సల్, డా.సుశాంత్ సోరెన్, డా.బ్రిజేష్ సింగ్, డా.అభినవ్, డా.మనీష్ సింఘాల్, డా.శశాంక్ చౌహాన్, డా.గంగ ప్రసాద్, డా.రాకేశ్ లతో కూడిన వైద్య బృందం సర్జరీ వియవంతంగా చేసి చరిత్ర సృష్టించారు. 

కడుపులో నుంచి రెండు కాళ్లు రావడంతో బాలుడి పెరుగుదల ఆగిపోయిందని డాక్టర్లు చెబుతున్నారు. అంతే కాకుండా ఈ కాళ్లు బాడీలోని ఇతర అవయవాలను డ్యామేజ్ చేసినట్లు తెలిపారు. అయితే తల్లి గర్భంలో ఇద్దరు కవలులుగా మార్పు చెందుతున్న సమయంలో.. ట్విన్స్ లో ఒకరి పెరుగదల ఆగిపోవడం వలన ఇలాంటి కండిషన్ ఏర్పడుతుందని డాక్టర్ల బృందం తెలిపింది. దీంతో మరో కవల బాడీకి ఇతర అవయవాలు అతుక్కుని పెరగడం జరుగుతుందని తెలిపారు.  

కోటి మందిలో ఒక్కరికి మాత్రమే ఇలా జరుగుతుందని.. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇప్పటి వరకు 42 మందికి మాత్రమే ఇలా జరిగిందని డా.కృష్ణ తెలిపారు. అయితే గర్భంలో ఉన్న సమయంలోనే ఈ కండిషన్ ను గుర్తించవచ్చునని, కానీ.. ఆర్థిక పరిస్థితుల వలన పేరెంట్స్ ముందుగా చూపించుకోలేక పోయారని తెలిపారు.