బ్రెయిన్​ డెడ్​ మహిళ అవయవదానం... ఔదార్యం చాటిన కుటుంబీకులు

ఖమ్మం టౌన్ :  బైక్​ పై నుంచి ప్రమాదవశాత్తూ పడి బ్రెయిన్​ డెడ్​ అయిన ఓ మహిళ అవయవదానానికి అంగీకరించి కుటుంబీకులు ఔదార్యం చాటారు. తాను మరణించినా వేరొకరికి జీవితం ఇస్తుండడం అభినందనీయం. ఖమ్మం సిటీ టేకులపల్లిలో ప్రమీల, శ్రీనివాసరావు భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరు గత గురువారం ముదిగొండ మండలం లక్ష్మీపురం గ్రామంలో జరిగే బంధువుల ఫంక్షన్‌‌కెళ్లి టూ వీలర్​‌‌పై సొంతూరుకు తిరిగొస్తున్నారు. మమత హాస్పిటల్ రోడ్డు లో ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి ప్రమీల జారీ కింద పడిపోయి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. హుటాహుటిన ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌కు తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి డాక్టర్లు వచ్చిన రిపోర్టు ఆధారంగా బ్రెయిన్ డెడ్ అని తెలిపారు. డాక్టర్ల సూచన మేరకు కుటుంబీకులు ప్రమీల అవయవదానానికి అంగీకరించారు. ఆ మేరకు అవయవాలను వైద్యులు సేకరించారు. ఆమె మృతదేహాన్ని ఇవాళ టేకులపల్లి తీసుకురానున్నారు.