గాలి వానకే కూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జీ

పెద్దపల్లి– జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సరిహద్దులోని ఓడేడు వద్ద  మానేరుపై ఉన్న బ్రిడ్జి గార్డర్లు మరోసారి కుప్ప కూలాయి. బీఆర్ఎస్‌ సర్కార్‌‌ హయాంలో ఎనిమిదేండ్ల కింద ప్రారంభించి ఆ తర్వాత వదిలేయగా ఏప్రిల్ 23న ఈదురు గాలులకు మూడు గార్డర్లు కుప్పకులాయి. మంగళవారం రాత్రి మరోసారి ఈదురుగాలులకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల వైపు ఉన్న 17,18 పిల్లర్ల వద్ద మరో నాలుగు గార్డర్లు కుప్పకులాయి. రెండు రోజుల కింద మానేరులో వేసిన తాత్కాలిక మట్టి రోడ్డు తెగిపోయింది. నీటి ఉధృతి తగ్గడంతో మళ్లీ మట్టి రోడ్డు వేశారు. మొదటిసారి గార్డర్లు కూలిన టైంలో చీఫ్ ఇంజినీర్ బ్రిడ్జిని పరిశీలించి గార్డర్ల కింద ఉన్న చెక్కలు తొలగించాలని సూచించినా కాంట్రాక్టర్‌‌ పట్టించుకోకపోవడంతో మళ్లీ కూలాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.