పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలిపోయింది. ముత్తారం మండలంలోని ఓడేడు గ్రామం వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జ్ సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా కూలిపోయింది. వంతెన కూలింది రాత్రి టైం కాబట్టి.. అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈదురు గాలుల బీభత్సానికే వంతెన కుప్పకూలినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షానికి బ్రిడ్జ్ పిల్లర్లు కుంగిపోయాయి. దీనికి తోడు రాత్రి ఈదురు గాలుల ప్రభావంతో బ్రిడ్జిపై ఉన్న గైడర్లు కింద పడిపోయాయి.
నాణ్యతలేని పనులు వల్లే బ్రిడ్జ్ కూలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఓడేడు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి మధ్య దూరం తగ్గించేందుకు వాగుపై ఈ వంతెన నిర్మిస్తున్నారు. 2016లో ఆగస్టులో రూ.49 కోట్లతో వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభం కాగా.. మధ్యలో కాంట్రాక్టర్ మారడం, నిధుల లేకపోవడంతో బ్రిడ్జ్ నిర్మాణం ఆలస్యమవుతూ వస్తోంది. ఈ క్రమంలో తొమ్మిదేళ్లు గడిచినా బ్రిడ్జ్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటివరకూ 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.