తీర్పు చెప్పిన ఇండియన్ సంతతి
జడ్జి జస్టిస్ పరమ్‌జిత్ కౌర్
లండన్ : సీరియల్ రేపిస్టుకు బ్రిటన్‌లోని కోర్టు 36 జీవిత ఖైదులు విధించింది. పెరోల్ ఇవ్వకుండా కనీసం 30 ఏండ్ల పాటు జైల్లో ఉంచాలని ఆదేశించింది. లండన్‌లోని సౌత్‌వర్క్ క్రౌన్ కోర్టులో భారత సంతతికి చెందిన జడ్జి జస్టిస్ పరమ్‌జిత్ కౌర్ బాబీ చీమా గ్రబ్ తీర్పు చెప్పారు. డేవిడ్ కారిక్ అనే వ్యక్తి.. స్కాట్లాండ్ యార్డులో పోలీసు ఆఫీసర్‌గా పని చేస్తున్న సమయంలో మహిళలపై క్రూరమైన లైంగిక నేరాలకు పాల్పడ్డాడు. హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లో 2003 నుంచి 2020 దాకా 17 ఏండ్ల వ్యవధిలో 12 మందికి పైగా ఆడవాళ్లను రేప్ చేశాడు. ఈ కేసు విచారణ తర్వాత తీర్పు చెప్పిన జస్టిస్ చీమాగ్రబ్.. 48 ఏళ్ల నిందితుడు దారుణమైన నైతిక అవినీతికి పాల్పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యంగా ముందుకు వచ్చిన బాధితులను ప్రశంసించారు. “నువ్వు చాలా మంది మహిళలపై అత్యాచారం చేశావు. లైంగిక వేధింపులకు పాల్పడ్డావు. బాధితులు నీ గురించి ఫిర్యాదు చేయబోరని నువ్వు అనుకున్నావు” అని జడ్జి చెప్పారు. కారిక్ 12 మంది మహిళలపై 49 నేరాలకు పాల్పడినట్లు నిరూపితమైంది. ఇందులో 24 సార్లు రేప్ చేయడం, లైంగిక వేధింపులు, తప్పుడు జైలు శిక్షలు వంటివి కూడా ఉన్నాయి. ఆరోపణలు బయటికి రావడంతో గత నెలలో పోలీస్ శాఖ నుంచి అతడిని తొలగించారు.