- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడి అక్రమాలు
- 10 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాయం
- అధికారుల తనిఖీలో బయటపడ్డ బాగోతం
ఈ సీజన్లో కేంద్రం ఏ గ్రేడ్ వడ్లకు రూ. 2,203, కామన్ రకానికి 2,183 మద్దతు ధర ప్రకటించింది. కానీ జనగామ మార్కెట్లో ట్రేడర్లు కుమ్మక్కై ఈ-నామ్ పద్ధతిలో రూ.1,800 నుంచి 1,900 మధ్య కొన్నారు. క్వింటాల్‌కు రూ.500 నుంచి 600 వరకు తగ్గించడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగడంతో వారం క్రితం ముగ్గురు ట్రేడర్లపై ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టింది. దీంతో మద్దతు ధర పెట్టలేమని, క్రిమినల్ కేసులు ఎత్తివేయాలనే డిమాండ్‌తో ట్రేడర్లు కొనుగోళ్లను బంద్ పెట్టారు. మంత్రులు చెప్పినా వినిపించుకోకుండా ఐదు రోజులపాటు మొండికేశారు. చివరకు అధికారులే మెట్టు దిగి ట్రేడర్లతో చర్చలు జరపడంతో మంగళవారం క్వింటాల్‌కు రూ. 1,713 నుంచి రూ.2వేల దాకా కొన్నారు.
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాలో సీఎంఆర్ కింద సర్కారు ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లే కాదు, దళారులూ బుక్కేశారు. మిల్లులేని ఓ దళారీకి వందల కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం కేటాయించగా.. రూ.220 కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే అండదండలతో కోట్ల విలువైన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకొని అక్రమాలకు పాల్పడ్డాడు. తాజాగా ఆఫీసర్లు చేపట్టిన తనిఖీల్లో సదరు దళారీ ఏకంగా రూ.220 కోట్ల విలువైన వడ్లు మాయం చేసినట్లు తేలింది.
గత బీఆర్ఎస్ హయాంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ఇమ్మిడి సోమనర్సయ్య పొలిటికల్ లీడర్ల అండతో అక్రమాలకు తెర లేపాడు. తిరుమలగిరిలో సంతోషి మాత, రఘురామ, బాలాజీ, శ్రీ వేంకటేశ్వర రైస్ మిల్‌తో పాటు ఫణిగిరి వద్ద సంతోషి, హర్షిత రైస్ మిల్లులు ఉన్నట్లు అధికారులతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. దీంతో అధికారులు ఈ మిల్లులకు ధాన్యం కేటాయించారు.
2022–23 రబీ, 2023–24 ఖరీఫ్ సీజన్లలో ధాన్యాన్ని కేటాయించగా.. సకాలంలో సీఎంఆర్ అందించలేదు. పలుమార్లు గడువు పెంచినా స్టాక్ ఉన్నట్టు నమ్మించాడు. మాజీ ఎమ్మెల్యే అండతో అధికారులను తప్పుదోవ పట్టించాడు. సీఎంఆర్ ఎంతకూ అప్పగించకపోవడంతో అధికారులు తనిఖీ చేయగా.. ఫణిగిరి వద్ద సంతోషి, హర్షిత రైస్ మిల్లులు లేవని తేలింది. సోమనర్సయ్యకు చెందిన మిల్లుల్లో రూ.220 కోట్ల విలువ చేసే 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు.
కేసు నమోదు చేశాం: వెంకట రావు, కలెక్టర్
సూర్యాపేట జిల్లాలో సీఎంఆర్ ఇవ్వని రైస్ మిల్లులపై తనిఖీలు చేపట్టాం. విజిలెన్స్ అండ్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ తనిఖీలు చేసి కోదాడ కోమరబండ శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్, తిరుమలగిరిలోని సంతోష్ రైస్ మిల్లుల్లోని లెక్కల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించాం. తిరుమలగిరి, కోదాడ మిల్లులపై కేసు నమోదు చేశాం. జిల్లాలోని ప్రతి మిల్లు నివేదికలను ప్రభుత్వానికి పంపిస్తాం. ఇంకా కొన్ని మిల్లుల్లో తనిఖీలు చేస్తున్నాం.