తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే నాణ్యమైన విద్యను అందించే దిశగా విద్యావ్యవస్థను పటిష్టంగా నిర్మాణం చేసుకోవలసిన అవసరం ఉండే. అందుకు భిన్నంగా గత బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైంది. ప్రవేటు వ్యవస్థలో కేవలం నిరుద్యోగ యువత జీవనం కోసం ఏర్పాటు చేసుకున్న చిన్నచిన్న పాఠశాలల స్థానంలో ఆంధ్ర ప్రాంత పెట్టుబడులు ప్రవేశించి విద్యను పూర్తిస్థాయి వ్యాపారంగా మార్చివేశాయి. ]
కొన్ని సంస్థలు గుత్తాధిపత్యాన్ని చలాయించి విద్యావ్యవస్థను శాసిస్తూ విద్యావ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగించారు. ఈ పరిణామాన్ని అడ్డుకోవడంలో, ప్రభుత్వ విద్యను పరిరక్షించుకోవడంలో తెలంగాణ సమాజం అవసరమైన మేరకు స్పందించలేదు.మొదటి నుంచీ విద్యాపరంగా మెరుగైన స్థితిలో ఉన్న ఆంధ్ర ప్రాంతం కంటే అన్ని రంగాలలో అత్యంత వెనుకబాటును ఎదుర్కొంటున్న తెలంగాణాలో దీని దుష్ప్రభావం తీవ్రస్థాయిలో పడింది. ఫలితంగా అప్పుడే పాఠశాలల వైపు అడుగులు వేస్తున్న మొదటి తరం సమూహాల ఆకాంక్షలకు పురిటిలోనే తీరని విఘాతం ఏర్పడింది.
తెలంగాణలోని ఇతర అన్ని రంగాల మాదిరిగానే విద్యారంగాన్ని కూడా సంక్షోభంలోకి నెట్టాయి నాటి ఆంధ్ర పాలక ప్రభుత్వాలు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలు, పాఠశాల విద్య పట్ల పాలకుల నిర్లక్ష్య ధోరణి, మరోవైపు కార్పొరేట్ విద్యానుకూల చర్యల కారణంగా అవాంఛనీయ పరిస్థితులు నెలకొన్నాయి.
బీఆర్ఎస్ పాలనలో విద్యావ్యవస్థ నిర్వీర్యం
ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం తెలంగాణ సమాజం ప్రైవేటు, కార్పొరేట్ విద్య మాయాజాలం వైపు నెట్టివేయబడింది. అన్ని రంగాలలో ఇదే దుస్థితిని గమనించిన తెలంగాణ సమాజం సొంత రాష్ర్ట ఏర్పాటు తప్ప మరో పరిష్కారం లేదని భావించింది. రాష్ట్ర సాధన ఉద్యమంలో తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొని, ఎనలేని త్యాగాల దారుల్లో తెలంగాణ సమాజం మొత్తం ఒక్కటిగా నిలబడి సొంత రాష్ర్ట కలను సాకారం చేసుకుంది. గడిచిన పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలకు తగినట్లుగా ప్రభుత్వ పాఠశాల విద్య పటిష్టతకు చర్యలు తీసుకుంటుందని తెలంగాణ లోని విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, సామాజికవేత్తలు, మేధావులు భావించారు. కానీ, 2014 నుండి 2023 వరకు ఉన్న తెలంగాణ మొదటి ప్రభుత్వంలో ఆశించిన ఫలితం అందలేదన్నది చేదు వాస్తవం.
పాఠశాల విద్య బలోపేతానికి చర్యలు
విద్యారంగంలో 1990ల నాటి దుస్థితి కొనసాగడం తెలంగాణ అభివృద్ధికి, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పునర్నిర్మాణానికి తీవ్ర విఘాతం కలిగించే విషయం. ఈ పరిస్థితిని చక్కదిద్ది తెలంగాణ ప్రజల అవసరాలకు ఆకాంక్షలకు తగినట్లుగా తెలంగాణ బడులను నిర్మాణం చేసుకోవడం సమాజం, రేవంత్ ప్రభుత్వం ముందున్న అత్యంత ప్రధాన కర్తవ్యం. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ని ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ విద్యపట్ల కొంత సానుకూల వైఖరి తీసుకున్న సూచనలు అగుపిస్తున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పరిచి వసతులు సమకూర్చడం, ప్రభుత్వ బడులకు ఉచిత కరెంటు, ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించడం, పదోన్నతులు కల్పించడం, ఎప్పటి నుంచో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలు భర్తీచేయడం వంటి చర్యలు తప్పకుండా ప్రభుత్వ పాఠశాల విద్య బలోపేతం కావడానికి దోహదం చేస్తాయి.
అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి సందర్భంలోనూ ఉపాధ్యాయులను దోషులుగా నిలబెట్టాలనే ధోరణికి భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్బీస్టేడియం వేదికగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో ప్రభుత్వ పాఠశాలల పట్ల, ప్రభుత్వ ఉపాధ్యాయుల పట్ల తమ సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేయడం, తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రభుత్వ బడుల పాత్ర ఉంటుందని ప్రకటించడం హర్షణీయం.
బడ్జెట్ కేటాయింపులేవిద్య పటిష్టతకు ఆయువుపట్టు
విద్యకు ఆర్థిక కేటాయింపులు లేకుండా ఇప్పుడున్న విద్యా సంక్షోభం నుంచి బయటపడటం అసాధ్యం. ఈ కేటాయింపులు ఒకే ఏడాది సాధ్యంకానప్పటికీ ఆ దిశగా అడుగులు వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
రానున్న బడ్జెట్లో విద్యకు కేటాయింపులు పెరగవలసిన అవసరం ఉంది. బడ్జెట్ కేటాయింపులు పూర్తిస్థాయిలో ఖర్చు చేసేలాగ ప్రణాళికలు రూపొందించాలి. ఫలితాలు తెలంగాణ భావితరం అనుభవించే రోజులు త్వరలో రావాలని ఆశిద్దాం. సమాజానికి పాఠశాలకు మధ్య ఒక సజీవ ఆత్మీయ బంధం బలపడాలని, కోరుకుంటున్న రేపటి ఉన్నత సమాజాన్ని నేడు మన ప్రభుత్వ పాఠశాలల్లో చూడగలిగే రోజు త్వరలో వస్తుందని కోరుకుందాం. కంప్యూటర్ విద్యలో పరిజ్ఞానం మొదలు.. తోలు డప్పు దరువుల విన్యాసాల వరకు అన్ని నైపుణ్యాలలో తెలంగాణ బాలలను తీర్చిదిద్దే వేదికగా ప్రభుత్వ బడి ఉండాలి. సర్కారు బడి పునాదిగా తెలంగాణ పునర్నిర్మాణానికి ఒక భూమిక సిద్ధం కావాలని కోరుకుందాం.
పాఠశాల విద్యపై చిగురిస్తున్న ఆశలు
సీఎం రేవంత్ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కొరకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించడం, ఎన్నో సంవత్సరాలుగా తీవ్ర సమస్యగా ఉన్న పాఠశాలల్లోని శానిటేషన్ సమస్యకు ఒక విధానపరమైన నిర్ణయం ప్రకటించడం వల్ల తెలంగాణలో పాఠశాల విద్యపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణ సమాజం పట్ల ఎంతో ఆరాటం ఉన్న నిబద్ధత కలిగిన అధికారిగా ప్రజల మన్ననలు పొందిన ఆకునూరి మురళి చైర్మన్గా తెలంగాణ విద్యాకమిషన్ ఏర్పాటు చారిత్రాత్మకం.
విద్యా కమిషన్ ఏర్పడిన వెంటనే క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టి విస్తృతస్థాయిలో పర్యటిస్తున్నారు. వివిధ మేనేజ్మెంట్లలో నిర్వహించబడుతున్న పాఠశాలలను సందర్శిస్తున్నారు. విద్యావ్యవస్థలో భాగస్వాములైన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యావేత్తలు, అధికారులు, ఉపాధ్యాయులతో చర్చిస్తున్నారు. ప్రజలతో పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తున్నారు. పాఠశాల విద్యలోని అన్ని అంశాలపై దృష్టిపెట్టి అధ్యయనం చేస్తున్నట్లు, త్వరలో రిపోర్టు సమర్పిస్తారని చైర్మన్ మురళి వెల్లడించారు. తెలంగాణ సమాజం కమిషన్ అందించనున్న నివేదిక కోసం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నది.
- గాజులు శ్రీధర్,ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు-