లక్నో: ఉత్తరప్రదేశ్లో మరో ఘోర ప్రమాదం జరిగింది. మీరట్లో శనివారం ఓ భవనం కుప్పకూలడంతో ఏడుగురు మృతి చెందగా.. మరి కొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ టీమ్స్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించాయి. భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఘటన స్థలంలో వర్షం కురుస్తుండటంతో సహయక చర్యలకు ఆటంకం ఏర్పడుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ దీపక్ మీనా మీడియాతో మాట్లాడుతూ.. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డీఆర్‌ఎఫ్) బృందాలు సంఘటనా స్థలంలో సహయక చర్యలు ముమ్మరంగా చేపడతున్నట్లు తెలిపారు. భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. భవన యజమానిని నఫో అల్లావుద్దీన్‌గా గుర్తించామని.. ఈ బిల్డింగ్లో డెయిరీని నడిపాడని వెల్లడించారు. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వెంటనే వెళ్లిండి: సీఎం యోగి
మీరట్ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి సమాచారం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షత గ్రాతులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. సీఎం ఆదేశాలతో మీరట్ డివిజన్ కమిషనర్ సెల్వ కుమారి జె, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విపిన్ తడా, సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆయుష్ విక్రమ్ సింగ్ రంగంలోకి దిగి.. ఘటన స్థలంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. చుట్టుపక్కల ప్రజలు కూడా సహాయక చర్యల్లో అధికారులకు సహకరిస్తూ మానవత్వం చాటుకున్నారు.