మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఘోరం జరిగింది. మూడంతస్తుల బిల్డింగ్ కుప్పకూలి ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. వీరిలో 5 నెలల పాప సహా ఆరుగురు మైనర్లు ఉన్నారు. మీరట్ జాకీర్ కాలనీలోని 50 ఏండ్ల పాత బిల్డింగ్‌లో బాధిత కుటుంబం ఉంటున్నది. మొత్తం 15 మంది అందులో ఉంటున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో డెయిరీ ఫామ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల అక్కడ కురుస్తున్న భారీ వర్షాలతో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వీళ్లు ఉంటున్న బిల్డింగ్ కుప్పకూలింది. ఇంట్లోని 15 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఓవైపు వర్షం కురుస్తున్నా, అర్ధరాత్రి 2 గంటల వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. మళ్లీ తిరిగి ఆదివారం ఉదయం ప్రారంభించారు.
ఇప్పటి వరకు 10 డెడ్ బాడీలను వెలికితీశామని అధికారులు తెలిపారు. మరో ఐదుగురు గాయపడ్డారని చెప్పారు. వాళ్లు ప్రస్తుతం ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్నారని, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ‘‘బిల్డింగ్ కూలిన సమయంలో అందులో 15 మంది ఉన్నారని బంధువులు చెప్పారు. ఆ టైమ్‌లో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మరో ఇద్దరిని శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చాం. ఇప్పటి వరకు 10 డెడ్ బాడీలను వెలికితీశాం. బాధిత కుటుంబం ఇంట్లోని గ్రౌండ్ ఫ్లోర్లో డెయిరీ ఫామ్ నిర్వహిస్తున్నది. కొన్ని ఆవులు కూడా చనిపోయాయి. శిథిలాలను పూర్తిగా తొలగించే వరకూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది” అని మీరట్ కలెక్టర్ దీపక్ మీనా తెలిపారు. కూలిన ఇల్లు ఇరుకు గల్లీలో ఉన్నదని, అక్కడికి బుల్డోజర్లు వెళ్లే పరిస్థితి లేదని, అందుకే రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమవుతున్నదని పేర్కొన్నారు.