పంజాబ్‎లో ఒక్కసారిగా కుప్పకూలిన బిల్డింగ్.. ఇద్దరు మృతి

పంజాబ్‎లో ఒక్కసారిగా కుప్పకూలిన బిల్డింగ్.. ఇద్దరు మృతి

చండీగఢ్: మొహాలి జిల్లాలో కుప్పకూలిన బిల్డింగ్ శిథిలాల నుంచి మరొకరి మృతదేహం బయటపడింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య రెండుకు చేరుకుంది. శనివారం సాయంత్రం పంజాబ్​రాష్ట్రం మొహాలి జిల్లా సోహనాలో మూడంతస్తుల అపార్ట్​మెంట్ ఉన్నట్టుండి కూలిపోయింది. శిథిలాల కింద ఐదుగురు చిక్కుకున్నట్టు స్థానికులు చెప్తున్నారు. సమాచారం అందగానే ఎన్డీఆర్ఎఫ్, స్టేట్ రెస్క్యూ టీమ్స్, పోలీసులు స్పాట్‎కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి తీవ్రగాయాలతో బయటపడ్డ 20 ఏండ్ల మహిళను ఆస్పత్రికి తరలించగా, ఆమె చికిత్స పొందుతూ శనివారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు. 

ఎక్సవేటర్లతో శిథిలాలను తొలగిస్తుండగా ఆదివారం ఉదయం 29 ఏండ్ల వ్యక్తి డెడ్​బాడీ బయటపడింది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని పోలీసులు చెప్తున్నారు. అపార్ట్ మెంట్​కు పక్కనే ఉన్న జాగలో బేస్​మెంట్ కోసం తవ్వకాలు జరపడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. తవ్వకాలు చేపట్టిన ప్లాట్, ప్రమాదానికి గురైన అపార్ట్​మెంట్ ఓనర్లపై కేసులు పెట్టినట్టు పోలీసులు తెలిపారు.