మాదాపూర్‎లో ఒక్కసారిగా పక్కకు ఒరిగిన బిల్డింగ్.. పరుగులు తీసిన స్థానికులు

హైదరాబాద్‎లోని మాదాపూర్ సిద్దిక్ నగర్‎లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం (నవంబర్ 19) రాత్రి సమయంలో ఉన్నట్టుండి ఓ బిల్డింగ్ పక్కకు ఒరిగింది. గమనించిన బిల్డింగ్ చుట్టు పక్కవారు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల అప్రమత్తం చేయడంతో బిల్డింగ్‏లో నివసిస్తోన్న వారు తీవ్ర భయాందోళనకు గురై వెంటనే బయటకు పరుగులు తీశారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఒరిగిన బిల్డింగ్‎ను పరిశీలించారు. పక్కకు ఒరిగిన అపార్ట్మెంట్ పక్కనే మరో నిర్మాణానికి గుంతలు తీయడంతో బిల్డింగ్ పక్కకు ఒరిగినట్లు సమాచారం. 

ALSO READ | బిర్యానీ తిని హాస్పిటల్ పాలైన యువకుడు.. ఇదే కారణం!

 బిల్డింగ్ ప్రమాదకరంగా పక్కకు ఒరగడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా బిల్డింగ్‎లో నివసిస్తోన్న వారితో పాటు బిల్డింగ్ చుట్టు పక్కల వారిని అధికారులు ఖాళీ చేయించారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది సైతం ఘటన స్థలానికి చేరుకున్నారు. బిల్డింగ్ పక్కకు ఒరిగిందన్న వార్త దావనంలా వ్యాప్తి చెండటంతో స్థానికులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని బిల్డింగ్‎ను చూడటంతో పాటు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.