గచ్చిబౌలిలో ఐదంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా ఒరిగింది

  • సమీపంలో పిల్లర్ల కోసం గుంతలు తవ్వడమే కారణం
  •  గచ్చిబౌలి సిద్ధిక్​ నగర్​లో ఘటన.. భయాందోళనలో స్థానికులు
  • బిల్డింగ్​లోని 10 కుటుంబాలను ఖాళీ చేయించిన డీఆర్ఎఫ్ టీమ్

గచ్చిబౌలి, వెలుగు : ఎలాంటి సెట్​బ్యాక్​ లేకుండా బిల్డింగ్​ నిర్మాణానికి గుంతలు తీయడంతో సమీపంలోని ఐదంతస్తుల బిల్డింగ్​పక్కకు ఒరిగింది. ఈ ఘటన గచ్చిబౌలిలోని సిద్ధిక్​నగర్​లో జరిగింది. ఏ క్షణంలో కూలుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్, హైడ్రా, పోలీస్​అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఒరిగిన బిల్డింగ్​తోపాటు పక్క ఇండ్లలోని కుటుంబాలను ఖాళీ చేయించారు. గచ్చిబౌలి సిద్ధిక్​నగర్ రోడ్డు నంబర్–1లోని 200 గజాల స్థలంలో కల్వకుల్ల శ్రీను అనే వ్యక్తి భారీ బిల్డింగ్​నిర్మాణం చేపట్టాడు. 

పనుల్లో భాగంగా రెండు రోజులుగా పిల్లర్ల కోసం గుంతలు తీయిస్తున్నాడు. ఎలాంటి సెట్​బ్యాక్, కాంపౌండ్​వాల్స్​లేకుండా తవ్వకాలు చేపడుతున్నాడు. ఈ క్రమంలో సదరు స్థలానికి ఆనుకుని ఉన్న ప్లాట్ నంబర్1639లోని లక్ష్మణ్ అనే వ్యక్తికి చెందిన 5 అంతస్తుల బిల్డింగ్​పిల్లరు బయటకు తేలాయి. మట్టి పూర్తిగా పోవడం, ఎలాంటి సపోర్టు లేకపోవడంతో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ఐదంతస్తుల బిల్డింగ్​పక్కకు ఒరిగింది. బిల్డింగ్​లోని జనం ఒక్కకసారిగా పెద్దగా కేకలు వేశారు.

స్థానికులు గమనించి పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది, మాదాపూర్​పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఒరిగిన బిల్డింగ్ లోని 8 పోర్షన్లలో దాదాపు 20 మంది నివసిస్తుండగా, వారందరినీ ఖాళీ చేయించారు. అలాగే ఒరిగిన వైపు ఉన్న రెండు ఇండ్లలోని కుటుంబాలను సైతం ఖాళీ చేయించారు.

అధికారుల అవినీతి..ఓనర్ల ధన దాహం

సిద్ధిక్​నగర్​ఘటనలో జీహెచ్ఎంసీ టౌన్​ప్లానింగ్​అధికారుల నిర్లక్ష్యం క్లియర్​గా తెలుస్తోంది. ఎటువంటి సెట్​బ్యాక్​ లేకుండా 60 గజాల విస్తీర్ణంలో ఓ వ్యక్తి ఏడాది కింద ఐదంతస్తుల బిల్డింగ్​నిర్మించగా, దానిని ఆనుకొని మరోవ్యక్తి 200 గజాల విస్తీర్ణంలో మరో బిల్డింగ్​నిర్మాణం కోసం తవ్వకాలు జరపడంతో ప్రమాదం జరిగింది. ఇప్పటికే అక్కడ పూర్తయిన నిర్మాణాలను చూస్తే టౌన్ ప్లానింగ్​అధికారుల పర్యవేక్షణ ఏ విధంగా ఉందో తెలిసిపోతుంది. బిల్డింగ్​యజమానుల ధన దాహం కూడా ప్రమాదానికి కారణమే. అందినకాడికి దండుకుని అడ్డగోలుగా పర్మిషన్లు ఇవ్వడంతోనే బిల్డింగ్ పక్కకు ఒరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఐదంతస్తుల బిల్డింగ్​ ఇల్లీగల్​ కన్​స్ట్రక్షన్

సెట్ బ్యాక్ లేకుండా పిల్లర్ల కోసం గుంతలు తవ్వడంతోనే పక్క బిల్డింగ్​ఒరిగింది. ఎలాంటి అనుమతులు లేకుండా 60 గజాల్లో ఐదు అంతస్తుల బిల్డింగ్​నిర్మించారు. బిల్డింగ్ యజమానితోపాటు స్థలం యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంజనీరింగ్ నిపుణుల సలహాలు తీసుకుంటున్నాం. ఒరిగిన బిల్డింగ్​ను కూల్చివేయాలా? లేదా అని విషయాన్ని నిర్ణయిస్తాం. ప్రస్తుతానికి ఒరిగిన బిల్డింగ్​తోపాటు చుట్టుపక్కల ఇండ్లలోని వారిని ఖాళీ చేయించాం.
 

– ఉపేందర్ రెడ్డి, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్