శ్రీరంగాపూర్, వెలుగు: ఎమ్మెల్యే చొరవతో గ్రామానికి బస్ రావడంతో వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం నాగరాల పునరావాస గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా బస్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నా రోడ్ సరిగా లేదని నిరాకరిస్తూ వచ్చారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బస్ సౌకర్యం కల్పించారు. శుక్రవారం గ్రామానికి ఆర్టీసీ బస్ రాగా, గ్రామస్తులు బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సిబ్బందికి స్వీట్లు తినిపించి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో రోడ్లు బాగున్నా మాజీ మంత్రి బస్ సౌకర్యం కల్పించే విషయంలో చొరవ చూపలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం నాగరాల గ్రామానికి బస్ సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు. మిగిలిన పునరావాస కేంద్రాలకు కూడా బస్ సౌలత్ కల్పించాలని కోరారు.