టెహ్రాన్: ఇరాన్‌లో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. పాకిస్తాన్ నుంచి ఇరాక్‌కు షియా యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు సెంట్రల్ ఇరాన్ ప్రావిన్స్ యాజ్ద్‌లో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 28 మంది ప్రాణాలు కోల్పోగా...మరో 23 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్రీట్మెంట్ పొందుతున్నవారిలో 14 మంది పరిస్థితి క్రిటికల్ గా ఉందని అధికారులు వెల్లడించారు.
బస్సులో ఉన్న ప్యాసింజర్లందరూ పాకిస్తాన్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 51 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. వారంతా పాకిస్తాన్ దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లోని లర్కానా సిటీ నుంచి ఇరాక్‌కు బయలుదేరారని వివరించారు. అయితే, ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు 500 కి.మీ. దూరంలోని టాఫ్ట్ సిటీ వద్ద బస్సు బ్రేక్‌లు ఫెయిల్ అయ్యాయని తెలిపారు. దాంతో బస్సు అదుపుతప్పి బోల్తాపడిందని వెల్లడించారు. ఘటనపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు.