మూడు రోజుల కింద అదృశ్యం అయిన వ్యాపారి.. పంజాగుట్టలో హత్య

 మూడు రోజుల కింద అదృశ్యం అయిన వ్యాపారి.. పంజాగుట్టలో  హత్య
  • ఎస్​ఆర్ నగర్​లోని ఓ గదిలో డెడ్​బాడీ గుర్తింపు

పంజాగుట్ట, వెలుగు: హైదరాబాద్ పంజాగుట్టలో మూడు రోజుల కింద అదృశ్యమైన వ్యాపారి హత్యకు గురయ్యాడు. ఎస్ఆర్ నగర్​లోని ఓ గదిలో ఆయన డెడ్​బాడీని పోలీసులు గుర్తించారు. జూబ్లీహిల్స్ ఎల్లారెడ్డిగూడ లోని టెలిఫోన్ గల్లీకి చెందిన విష్ణు రూపాని (45) హోల్​సేల్ వ్యాపారి. కుటుంబ సభ్యులంతా వివిధ రంగాల్లో బిజినెస్ చేస్తున్నారు. విష్ణు రూపాని ఆదివారం రాత్రి 10.30 గంటలకు ఇంటికి నుంచి బయటికెళ్లాడు. 12 గంటల్లోపు తిరిగొస్తానని భార్యతో చెప్పాడు. 

అర్ధరాత్రి దాటినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనకు ఫోన్ చేశారు. స్పందించకపోవడంతో అనుమానం వచ్చి అదే రోజు రాత్రి విష్ణు సోదరుడు మహేశ్ రూపాని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్​ఆర్ నగర్​లోని ఓ గది నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గది తలుపులు తెరిచి చూడగా.. విష్ణు రూపాని డెడ్​బాడీ కుళ్లిన స్థితిలో కనిపించింది. ఆ తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్​కు తరలించారు. మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్థిక లావాదేవీలే కారణమా?

విష్ణు రూపాని హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. విష్ణు వద్ద పని చేసే ఏపీకి చెందిన రమేశ్.. తన బైక్​ను తాకట్టుపెట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు సమాచారం. పథకం ప్రకారమే.. ఆదివారం రాత్రి బుద్ధనగర్​లోని తన రూమ్​కు విష్ణును తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. అక్కడ లిక్కర్ పార్టీ చేసుకున్నాక మత్తులో ఉన్న విష్ణును.. రమేశ్ ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నరు. రమేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు సరైన టైమ్​లో స్పందించకపోవడంతోనే విష్ణు హత్యకు గురయ్యాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.