
ఇటీవల కారులో మంటలు తరుచుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎండాకాలంలోఅయితే మరీ ఎక్కువ. ఖరీదైన కారు అయిన సరే ఫ్యామిలీతో ప్రయాణం చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బైపాస్ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ కారు మంటల్లో తగలబడిపోయింది. కారులో నుంచి ఉన్నట్టుండి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న వాళ్లు వెంటనే కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారులో ఉన్నవాళ్లు కిందకు దిగగానే కారు పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. అటువైపు వెళ్తున్న వారు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. విషయం తెలియగానే స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. మహబూబ్ నగర్ నుండి కారు హైదరాబాద్ వైపుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అయితే కారులో ఇలా మంటలు రావాడానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా సమ్మర్ లో అయితే సర్వీసింగ్ చేయకుండానే వేల కిలోమీటర్లు నడపడం కూడా ఇటువంటి ఘటనలకు దారితీస్తాయి. అంతేకాకుండా కార్ల టైర్లు సరిగ్గా లేకపోవడం, అరిగిపోయిన టైర్లతో ఎక్కువ దూరం ప్రయాణం చేసినప్పుడు టైర్లకు రోడ్డుకు మధ్య స్కార్క్స్ ఏర్పడి కూడా మంటలు వ్యాపించడానికి అవకాశం ఉంది. ఇక వాహనాల తయారీలో వినియోగించే ప్లాస్టిక్, ఫోమ్, ఎలక్ట్రికల్ వైరింగ్, ఫాబ్రిక్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి లాంగ్ డ్రైవ్ కు వెళ్లేముందు ఒకటికి రెండుసార్లు అన్ని చెక్ చేసుకుని వెళ్లడం మంచింది.