హైదరాబాద్ : నిర్లక్ష్యం నిండుప్రాణాల్ని బలతీసుకుంటోంది. అతివేగం కొంప ముంచుతోంది. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట అతివేగంతో ప్రమాదాల బారిన పడి చనిపోతున్నారు. కన్నవారికి, కుటుంబ సభ్యులకు గుండెకోతను మిగిల్చి వెళ్తున్నారు. నిర్లక్ష్యం కారణంగా ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా చాలామంది వాహనదారుల్లో మార్పు రావడం లేదు.
తాజాగా కూకట్ పల్లి KPHB లోధా రోడ్డులో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన i 20 కారు డివైడర్ ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. కారు టైరు పేలడంతో ఒక్కసారిగా వాహనం అదుపుతప్పింది. ఈ ఘటనలో కారు ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గాయాలపాలైన డ్రైవర్ ను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.