ఖమ్మం నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. NST రోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి దూసుకొచ్చిన కారు ఇద్దరు విద్యార్థినీలను ఢీకొట్టింది. ఈ ఘటనలో వాంకుడోతు ప్రసన్న, హరిత అనే ఇద్దరు గిరిజన విద్యార్థినీలకు తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. మెరుగైన చికిత్స కోసం బాధితురాలిని హైదరాబాద్ కు తరలించారు.
కారును డాక్టర్ నడిపారా..? లేక డ్రైవర్ నడిపారా..? అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు.. ప్రమాదానికి డాక్టరే కారణమని, ఈఘటనకు బాధ్యుడిగా డ్రైవర్ పై నెపం మోపుతున్నారని సమాచారం అందుతోంది. కారు నడిపే అనుభవం డాక్టర్ కు లేకపోవడం వల్లే సెల్లార్ లో నుంచి కారు బయటికి తీసే సమయంలో ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.