రోడ్డు ప్రమాదంలో ప్రముఖ వ్యాపారి కుమారుడు మృతి

కరీంనగర్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో జమ్మికుంట పట్టణానికి చెందిన ప్రముఖ జిన్నింగ్ మిల్లు వ్యాపారి కుమారుడు నితిన్(25) మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. 

బంధువులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం..

జమ్మికుంట పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి యుగేంధర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం (సెప్టెంబర్ 23న) సాయంత్రం గెట్ టు గెదర్ పార్టీకి వెళ్లారు. కొండాపూర్ లో నివాసం ఉంటున్న పెద్ద కుమారుడు చరణ్ ఇంటి వద్దనే ఉన్నారు. ఆదివారం యుగేంధర్, అతని భార్య అనురాధ, పెద్ద కుమారుడు చరణ్, అతని భార్య సంఘవితో పాటు నితిన్ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఉన్న ఫామ్ హౌస్ కు కారులో బయలుదేరారు. 

భారీ వర్షం పడడంతో యుగంధర్ ఫ్యామిలీ ప్రయాణిస్తున్న కారు ఉన్నట్టుండి అదుపుతప్పి.. పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొని.. మూడు పల్టీలు కొట్టింది. కారు నడుపుతున్న నితిన్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న యుగంధర్ దంపతులు, చరణ్ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో జమ్మికుంట పట్టణంలో విషాదం నెలకొంది.