- మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
- మానుకోట జిల్లా ఏటిగడ్డతండా సమీపంలో ప్రమాదం
- ముత్యాలమ్మగూడెం వద్ద మరో కారు ఢీకొని బాలుడి కన్నుమూత
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబాబాద్జిల్లాలో అతివేగంతో వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్‌లోని శివనగర్‌కు చెందిన సాయితేజ (29), మట్టెవాడకు చెందిన వెంగళదాసు సాయిరాం ( 28), సంగినేని సాయిరాం, పాక లక్ష్మణ్, రవితేజ కలిసి కారులో సోమవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లికి విహారయాత్ర కోసం బయలుదేరారు. అర్ధరాత్రి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏటిగడ్డ తండా సమీపంలోకి రాగానే అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొని బోల్తా కొట్టింది. వెంగళదాసు సాయిరాం, రవితేజ అక్కడికక్కడే చనిపోయారు. సంగినేని సాయిరాం, పాక లక్ష్మణ్, సాయితేజ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వరంగల్‌లోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. మరణించిన సాయితేజ తండ్రి రామకృష్ణ మట్టెవాడ ఏఎస్ఐగా పని చేస్తున్నారు.
రోడ్డుపైకి పరిగెత్తిన బాలుడు ..
మహబూబాబాద్ జిల్లా ముత్యాలమ్మ గూడెం వద్ద కారు ఢీకొని ఎనిమిదేండ్ల బాలుడు చనిపోయాడు. గూడూరు మండలం మచ్చర్లకు చెందిన చింత సుధాకర్-, వినోద హైదరాబాద్ లో కూలీలు. రైలులో సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వచ్చారు. రాత్రి కావడంతో ముత్యాలమ్మగూడెంలోని బంధువుల ఇంట్లో ఉన్నారు. మంగళవారం ఉదయం ఊరికి వెళ్లేందుకు బస్సు కోసం ముత్యాలమ్మగూడెం క్రాస్ రోడ్డు వద్ద కొడుకులు విజయ ప్రకాష్, జ్ఞాన ప్రకాష్ లతో కలిసి ఎదురుచూస్తున్నారు. మహబూబాబాద్ నుంచి నర్సంపేటకు వెళ్లే బస్సు వస్తుండడంతో పెద్ద కొడుకు విజయప్రకాష్ (8) ఆనందంతో రోడ్డుపైకి పరిగెత్తాడు. ఇదే టైంలో గూడూరు నుంచి మహబూబాబాద్ వస్తున్న కారు డ్రైవర్గమనించకుండా బాలుడిని ఢీకొట్టాడు. దీంతో విజయ్ప్రకాశ్ఎగిరి రోడ్డుపై పడగా తలకు తీవ్ర గాయమైంది. గూడూరు వైపు వెళ్తున్న ఎస్ఆర్వో ఝాన్సీదేవి అతడిని తన వెహికల్లో మహబూబాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించినా ప్రాణాలు దక్కలేదు. హాస్పిటల్లో నిర్జీవంగా పడిఉన్న అన్నను చూసిన జ్ఞానప్రకాశ్‘ అన్నా లే అన్నా..అన్నా లే అన్నా ఊరికి పోదాం ’ అని పిలవడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.