సత్తుపల్లి, వెలుగు: లక్షకు మూడు రెట్లు నకిలీ నోట్లు ఇస్తామని నమ్మబలికి నల్ల కాగితాలు ఇచ్చి మోసగించిన నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యతండాకు చెందిన వడిత్య రమేశ్ నాయక్ కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంకు చెందిన దొమ్మేటి రామకృష్ణ, కిన్నర వెంకన్నతో ఇటీవల పరిచయం ఏర్పడింది. ఐటీ సమస్యల కారణంగా సౌదీ అరేబియా, దుబాయ్, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో డబ్బు ఇరుక్కుపోయిందని, లక్ష వైట్ మనీ ఇస్తే మూడు రెట్లు బ్లాక్ మనీ ఇస్తానని రమేశ్నాయక్ ఇద్దరినీ నమ్మించాడు. గత నెలలో వారిద్దరిని సత్తుపల్లికి చెందిన దొంగనోట్ల ముఠా ప్రధాన సూత్రధారుడు ఎస్.కె మధార్ దగ్గరకు తీసుకెళ్లాడు. రామకృష్ణ, వెంకన్న అతనికి రూ. లక్ష నగదు, రూ. 4 లక్షలకు ప్రామిసరీ నోటు, ఖాళీ చెక్కు ఇచ్చారు. మధార్ వారికి రూ.15 లక్షల బ్లాక్ మనీ పేరిట నల్ల రంగు కాగితాల కట్టలు ఇచ్చాడు.
ఆ కాగితాలను ప్రత్యేక ద్రావణంలో కడిగితే అసలు నగదు వస్తుందని, తన వద్ద ద్రావణం అయిపోయిందని, త్వరలోనే పంపిస్తానని నమ్మించాడు. మళ్లీ ఇటీవల మరో రూ. లక్ష తీసుకొని రూ.5 లక్షల బ్లాక్ మనీ అంటూ నల్ల కాగితాల కట్టలు ఇచ్చాడు. ద్రావణం వచ్చిన తర్వాత పంపుతానని నమ్మబలికాడు. రోజులు గడుస్తున్న ద్రావణం పంపకపోవడం, ఫోన్ చేసినా రమేశ్, మధార్స్పందించకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మధార్, రమేశ్ తో పాటు రామకృష్ణ, వెంకన్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మధార్ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలోనూ దొంగ నోట్ల కేసులు నమోదయ్యాయి. దొంగ నోట్లు ఇస్తామని ఎవరు చెప్పినా ప్రజలు నమ్మి మోసపోవద్దని సీఐ సూచించారు.