రోడ్డుపై లిక్కర్ అమ్ముతున్న ఇద్దరిపై కేసు

హుజూర్ నగర్, వెలుగు : సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్‌ పహాడ్ దర్గా సమీపంలో లిక్కర్ విక్రయిస్తున్న ఇద్దరు మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు.  ఎక్సైజ్ సీఐ నాగార్జున రెడ్డి వివరాల ప్రకారం.. రావిపాడు గ్రామానికి చెందిన గండ్ర కోటమ్మ, గువ్వల సైదమ్మ జానపహాడ్‌లోని వైన్స్‌ నుంచి మద్యం కొనుగోలు చేసి డెక్కన్ సిమెంట్స్ సమీపంలో రోడ్డు పక్కన ఒక్కో బాటిల్‌పై ఎంఆర్పీ కంటే రూ. 50  అదనంగా తీసుకుని విక్రయిస్తున్నారు.  

కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌ అయ్యాయి. ఈ వీడియో అధారంగా విచారణ చేపట్టిన ఎక్సైజ్ పోలీసులు సోమవారం వారిని అదుపులోకి తీసుకున్నారు . మద్యం స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. వీరికి మద్యం సరఫరా చేసిన  వైన్స్ షాపుపైనా కేసు  నమోదు చేస్తామని వెల్లడించారు.