కేజ్రీవాల్‎పై పోటీ చేస్తోన్న బీజేపీ అభ్యర్థికి బిగ్ షాకిచ్చిన ఈసీ

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ అధినేత కేజ్రీవాల్‎పై పోటీగా నిలబడ్డ బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మపై కేసు నమోదు అయ్యింది. ఈసీ ఆదేశాల మేరకు.. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కింద పర్వేష్ వర్మపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తోన్న కేజ్రీవాల్‎పై బీజేపీ తరుపున పర్వేష్ వర్మ బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్‎ను ఓడించడమే లక్ష్యంగా ఆయన జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పర్వేష్ వర్మ తన నియోజకవర్గంలో ఓటర్లను మభ్యపెట్టేందుకు బూట్లు పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 

అంతేకాకుండా పర్వేష్ షూస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. దీంతో పర్వేష్ వర్మ బూట్లూ పంపిణి చేస్తోన్న వీడియోలను న్యాయవాది రజనీష్ భాస్కర్ ఈసీకి ఫార్వర్డ్ చేశారు. ఎన్నికల సమయంలో అభ్యర్థి లేదా అతని ఏజెంట్ ఓటర్లకు బహుమతులు ఇవ్వడం లేదా మభ్యపెట్టడం ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 ప్రకారం నేరమని.. ఈ వీడియో ఆధారంగా బీజేపీ అభ్యర్థిపై కేసు నమోదు చేయాలని ఈసీని కోరారు. 

ALSO READ | బీఆర్ఎస్ కాదు.. బీ‘ఆర్ఎస్ఎస్’: గులాబీ పార్టీకి సీఎం రేవంత్ కొత్త పేరు

న్యాయవాది రజనీష్ భాస్కర్ పంపిన వీడియోలను పంపిన రిటర్నింగ్ అధికారి.. పర్వేష్ వర్మ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు నిర్ధారించారు.  ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కింద పర్వేష్ వర్మపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు బీజేపీ అభ్యర్థిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, కేజ్రీవాల్ పై పోటీ చేస్తోన్న బీజేపీ అభ్యర్థిపై కేసు నమోదు కావడం ఢిల్లీ  రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక, ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే.