హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అనుమతి తీసుకోకుండా పార్టీ నేతలతో కలిసి ఆర్ఎస్పీ.. హయత్ నగర్ శేరిగూడలోని ఎస్సీ గురుకుల ఇంటర్ కాలేజీలోకి వచ్చారని ఆ కాలేజీ ప్రిన్సిపల్ ధనలక్ష్మి ఆదివారం ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలు క్యాంపస్‌లోకి ప్రవేశించి ఫ్యాకల్టీ విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. క్యాంపస్‌కు కాంపౌండ్ లేకపోవడంతో ఈజీగా వచ్చారన్నారు. విద్యార్థులను రెచ్చగొడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని పార్టీ నేతలు భయబ్రాంతులకు గురిచేశారన్నారు. క్యాంపస్‌కు భద్రత కల్పించడంతో పాటు వారిపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు.
గురుకులాలపై వినతులు స్వీకరిస్తం: వర్షిణి
పర్మిషన్ తీసుకోకుండా గురుకుల స్కూల్స్, కాలేజీల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో పాటు పార్టీ నేతలు వచ్చి స్టూడెంట్స్, ఫ్యాకల్టీని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి ఆదివారం ఒక ప్రకటనలో అన్నారు. ఆర్ఎస్పీ గురుకుల సెక్రటరీగా ఉన్నపుడు ఆయన తీసుకున్న నిర్ణయాలపై ఇప్పటికీ స్టూడెంట్లు, ఫ్యాకల్టీలు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. ఇవి బయటి వ్యక్తులకు తెలియవని ఆమె అన్నారు.
అనుమతి లేకుండా ఎవరైనా గురుకుల స్కూళ్లు, కాలేజీల్లోకి ప్రవేశించడం సొసైటీ రూల్స్‌కు విరుద్ధమని, ఇవి క్రిమినల్ చర్యలకు పాల్పడమేనని తెలిపారు. రాజకీయ ఉద్దేశంతో ఇలాంటి పనులు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. గురుకులాలపై ఎలాంటి వినతులు ఇచ్చినా స్వీకరించడానికి తాము రెడీగా ఉన్నామని తెలిపారు. వ్యక్తిగతంగా మాసాబ్ ట్యాంక్‌లో సంక్షేమ భవన్‌కు ప్రతి సోమవారం వచ్చి వినతులు అందజేయవచ్చని సూచించారు. లేదా secretarytgswreis@gmail.com ద్వారా కూడా సంప్రదించవచ్చని వెల్లడించారు.