బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట సభకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని నిలదీయాలని పిలుపునిస్తూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీడియో రిలీజ్​చేయడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ కాంగ్రెస్ ప్రచారానికి భంగం కలిగించేలా, సీఎం సభను అడ్డుకునేలా ప్రజలను రెచ్చగొడుతూ వీడియోలో మాట్లాడారని జమ్మికుంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొలుగూరి సదయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసినట్లు జమ్మికుంట టౌన్  సీఐ రవి వెల్లడించారు.  ‘హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలంతా రేపు సీఎం రేవంత్ రెడ్డిని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించండి.. మళ్లీ దొరకడు’ అని ఏప్రిల్ 29న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు.  ఇది ప్రజలను రెచ్చగొట్టేలా ఉందంటూ పోలీసులు కేసు ఫైల్​చేశారు.