ముంబై: మరికొన్ని గంటల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల జరగనున్న వేళ రాష్ట్ర పాలిటిక్స్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి వినోద్ తావ్డేపై కేసు నమోదు అయ్యింది. పాల్ఘర్‌లో ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారన్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. వినోద్ తావ్డేతో పాటు నల్లసోపారా అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ తరుఫున బరిలోకి దిగుతోన్న రాజన్ నాయక్‌పైన ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది.
అసలేం జరిగిందంటే..?
పోలింగ్‌కు మరికొన్ని గంటల ముందు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పాల్ఘర్ జిల్లాలోని విరార్‌లోని ఓ హోటల్‌లో వినోద్ తావ్డే, బీజేపీ అభ్యర్థి రూ.5 కోట్లు పంపిణీ చేశారని బహుజన వికాస్ అఘాడీ నేతలు ఆరోపించారు. ఓ హోటల్‌లో వినోద్ తావ్డే, బీజేపీ క్యాండిడేట్ డబ్బులు పంచుతోన్న ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బహుజన వికాస్ అఘాడీ, కాంగ్రెస్ నేతలు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి బీజేపీపై నిప్పులు చెరిగారు. ఓటర్లను డబ్బులతో ప్రలోభ పెట్టి.. తప్పుడు మార్గంలో బీజేపీ గెలవాలని ప్రయత్నిస్తోందని విమర్శించాయి. ఈ మేరకు ఓటర్లను డబ్బులతో ప్రలోభ పెట్టిన వినోద్ తావ్డే, నల్లసోపారా బీజేపీ అభ్యర్థి రాజన్ నాయక్‌పై బీవీఏ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బీవీఏ ఫిర్యాదు మేరకు వినోద్ తావ్డే, రాజన్ నాయక్ పై కేసు నమోదు చేయాలని మహారాష్ట్ర పోలీసులను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు ఇద్దరిపైన పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.
ALSO READ | ఎలక్షన్లో డబ్బు పంచుతూ బీజేపీ లీడర్లు : వీడియో వైరల్
ఈ ఘటనపై వినోద్ తావ్డే స్పందించారు. డబ్బులు పంచి ఓటర్లను ప్రలోభ పెట్టినట్లు వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. గత 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని.. కానీ ఏ రోజు ఓటర్లను డబ్బులు పంచి ప్రలోభ పెట్టిన కేసులో చిక్కుకోలేదని తెలిపారు. మా పార్టీ అభ్యర్థి రాజన్ నాయక్ నన్ను టీ తాగడానికి రావాలని కోరడంతో అక్కడికి వెళ్లానని.. అక్కడ ఎన్నిక గురించి రాజన్ నాయక్, పార్టీ కార్యకర్తలతో చర్చించామని స్పష్టం చేశారు. సుప్రియా సూలే, రాహుల్ గాంధీ ఎందుకు ఇదంతా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాగా, 2024, నవంబర్ 20న మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 2024, నవంబర్ 23న ఫలితాల వెలువడనున్నాయి.