ప్రేమపేరుతో యువతి ట్రాప్
యువకుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
కేసు నమోదు చేసిన పోలీసులు
కోటగిరి, వెలుగు : నిజామాబాద్ జిల్లాలో ఓ యువతిని ఓ వర్గం యువకుడు ట్రాప్ చేశాడనే సమాచారంతో శనివారం కోటగిరి పోలీస్ స్టేషన్‌కు ఓ వర్గం యువకులు భారీగా తరలివచ్చారు. కోటగిరి స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలోని బాలికకు ఓ యువకుడు ప్రేమపేరుతో ఇంటి నుంచి తీసుకెళ్లిపోయాడని బాలిక కుటుంబసభ్యులు శనివారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఎంసెట్ ఎగ్జామ్ ఉందని హాల్‌టికెట్ తెచ్చుకుంటానని ఈనెల 7న ఇంటి నుంచి బోధన్ వెళ్లిన ఆ బాలికను యువకుడు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిపోయాడని ఎస్సై దృష్టికి తీసుకెళ్లారు. గతంలో కూడా తమ కూతురు బిచ్కుందలోని వాళ్ల అమ్మమ్మ ఇంట్లో ఉన్నప్పుడు అదే యువకుడు తమ బిడ్డను ప్రేమ పేరుతో మోసం చేసి తీసుకెళ్లిపోయాడన్నారు. అప్పుడు బిచ్కుంద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని బాలిక కుటుంబసభ్యులు వాపోయారు.
అప్పుడే కేసు నమోదు చేసి అతడిపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ యువకుడిపై వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కాగా లవ్ జిహాద్ లో భాగంగానే హిందూ బాలికను ముస్లిం యువకుడు ట్రాప్ చేసి ప్రేమ పేరుతో లోబర్చుకుని ఇంటినుంచి తీసుకెళ్లిపోయాడని హిందూ సంఘాల యువకులు ఆరోపిస్తున్నారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యువకుడిపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని, పూర్తి వివరాలు విచారణ తర్వాత వెల్లడిస్తామని ఎస్సై మచ్చెందర్ రెడ్డి తెలిపారు.