హైదరాబాద్ : పిల్లి చోరీకి గురైందంటూ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైంది. ఎంతో ఇష్టంగా..అపూరూపంగా పెంచుకుంటున్న తమ పిల్లిని గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఎత్తుకెళ్లాడని దాని యజమాని పీఎస్ లో ఫిర్యాదు చేశాడు.
పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. జహంగీర్ నగర్ కాలనీకి చెందిన మహమూద్ అనే వ్యక్తి గత 18 నెలల క్రితం ఓ పిల్లిని తీసుకువచ్చి..ఇంట్లో ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నాడు. ఆ పిల్లి కూడా ఇంట్లో వారందరితో ఒక కుటుంబ సభ్యుడిలా కలిసే ఉంటుంది. అయితే.. ఈ నెల 8వ తేదీన రాత్రి సుమారు 10 గంటల సమయంలో బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి..పిల్లిని తీసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.
పిల్లి కనిపించకపోయే సరికి దాని యజమాని చుట్టుపక్కల వెతికాడు. అయినా దాని జాడ ఎక్కడా కనిపించకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నారు.
చోరీకి గురైన పిల్లి అరుదైన హౌ మనీ(Khow Manee)రకానికి చెందినదని యజమాని చెప్పాడు. పిల్లి ఒక కన్ను బ్లూ..మరో కన్ను గ్రీన్ రంగులో ఉండటం దీని ప్రత్యేకతని చెప్పాడు.దీని ఖరీదు సుమారు రూ.50 వేల వరకూ ఉంటుందని తెలిపాడు.