- పిల్లర్లు కుంగడంలో విద్రోహ చర్య ఉందని ఫిర్యాదు చేసిన ఏఈ
- మహాదేవ్‌పూర్ పీఎస్‌లో ఈ నెల 22న ఎఫ్ఐఆర్
- విచారణ జరుపుతున్నామన్న భూపాలపల్లి ఎస్పీ
- ఇరిగేషన్ శాఖ అభ్యర్థన మేరకు అంతర్రాష్ట్ర రాకపోకలు బంద్
జయశంకర్ భూపాలపల్లి/ మహాదేవ్‌పూర్, వెలుగు: మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ పిల్లర్లకు పగుళ్లు వచ్చి భూమిలోకి కుంగిన ఘటనలో పీడీపీపీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు సోమవారం ప్రకటించారు. పిల్లర్లు దెబ్బతిని భూమిలోకి కుంగడం వెనుక విద్రోహ చర్య ఏమైనా ఉందో తెలుసుకోవాలని ఇరిగేషన్ శాఖ ఏఈ రవికాంత్ ఈ నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం 6.20 గంటల సమయంలో మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ వద్ద పెద్ద శబ్దం వచ్చిందని, దీంతో పిల్లర్ కుంగిపోయి పైన ఉన్న రోడ్డు డ్యామేజీ అయినట్లుగా ఇరిగేషన్ ఏఈ రవికాంత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్లాక్ 7కు చెందిన 20వ నంబర్ పిల్లర్, 19, 21వ నంబర్ పిల్లర్లకు డ్యామేజీ జరిగిందని తెలిపారు. ఎల్ అండ్‌టీ కంపెనీకి చెందిన ఫోర్‌మెన్ బిద్యుత్ దేబనాథ్‌తో కలిసి తాను ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ చేయగా ఈ విషయం తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల చర్యల వల్ల ప్రభుత్వ నిర్మాణమైన బ్యారేజీకి డ్యామెజీ అయినట్లుగా తనకు అనుమానం ఉందని ఫిర్యాదులో రాశారు. దీంతో పోలీసులు క్రైం నంబర్174 ద్వారా ఐపీసీ 427 సెక్షన్ పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ప్రకటించారు.
విచారణ జరుపుతున్నం: భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు భూమిలోకి కుంగిన విషయమై ఇరిగేషన్ ఏఈ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహాదేవ్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని సోమవారం భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖారే ప్రకటించారు. నీటిపారుదల శాఖ అధికారి ఇచ్చిన పిటిషన్ మేరకు ఈ నెల 22న మహదేవ్‌పూర్ పీఎస్‌లో కేసు నమోదైందని తెలిపారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, ఎఫ్‌ఎస్‌ఎల్ టీమ్‌లు, క్లూస్ టీమ్‌ల ద్వారా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ బ్యారేజీని పరిశీలించిందని, నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు పోతామని అన్నారు. ఇరిగేషన్ శాఖ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు భద్రతా సమస్య, ప్రమాదాల నివారణ కోసం మేడిగడ్డ బ్రిడ్జి పై నుంచి అంతర్రాష్ట్ర రాకపోకలు నిలిపివేశామని ఎస్పీ పేర్కొన్నారు.