హైదరాబాద్: శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పోలీసులు మరో బిగ్ షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఇష్యూలో ఎమ్మెల్యే గాంధీపై ఇప్పటికే కేసు నమోదు కాగా.. తాజాగా ఆయనపై మరో ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిర్యాదు మేరకు అరికెపూడి గాంధీపై గచ్చిబౌలి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే గాంధీతో పాటు ఆయన కుమారుడు, సోదరుడిపైన పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. కార్పొరేటర్లు వెంకటేష్‌గౌడ్, శ్రీకాంత్‌లను కూడా పోలీసులు నిందితులుగా చేర్చారు.
కాగా, గత మూడు రోజులుగా ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల విమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్ల ఎపిసోడ్ స్టేట్ పాలిటిక్స్‌లో కాకరేపిన విషయం తెలిసిందే. నీ ఇంటికి వస్తా అంటే లేదు నీ ఇంటికే వస్తా అంటూ ఎమ్మె్ల్యేలు ఇద్దరూ పోటాపోటీగా సవాళ్లు విసురుకుని రాష్ట్ర రాజకీయాలను రంజుగా మార్చారు. ఈ క్రమంలోనే గురువారం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపూడి గాంధీ తన అనచురులు, అభిమానులతో కలిసి వెళ్లగా.. అక్కడ తీవ్ర ఉద్రిక్త నెలకొన్న విషయం తెలిసిందే.
కౌశిక్ రెడ్డి ఇంట్లోకి బలవంతంగా దూసుకెళ్లిన గాంధీ అనుచరులు.. కౌశిక్ రెడ్డి ఇంటిపై గుడ్లు, టమాటాలతో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాంధీ తన అనుచరులతో కలిసి తనపై హత్యాయత్నానికి ప్రయత్నించాడని పిటిషన్ ఇచ్చారు. కౌశిక్ రెడ్డి కంప్లైంట్ మేరకు ఎమ్మెల్యే గాంధీతో పాటు ఆయన కుమారుడు, సోదరుడిపై తాజాగా పోలీసులు అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేశారు.