కాళేశ్వరం ఈఎన్సీ హరిరాంపై అక్రమాస్తుల కేసు

కాళేశ్వరం ఈఎన్సీ హరిరాంపై అక్రమాస్తుల కేసు
  • అదుపులోకి తీసుకున్న ఏసీబీ
  • విజిలెన్స్‌‌, ఎన్డీఎస్‌‌ఏ నివేదికల ఆధారంగా రంగంలోకి..   
  • హరిరాం, ఆయన బంధువుల ఇండ్లలో సోదాలు 
  • విల్లాలు, ఫ్లాట్లు, ప్లాట్లు, వ్యవసాయ భూములు ఉన్నట్టు గుర్తింపు
  • ఇయ్యాల కూడా తనిఖీలు కొనసాగే అవకాశం 
  • హరిరాం భార్య అనిత కూడా ఇరిగేషన్‌‌ శాఖలో డిప్యూటీ ఈఎన్సీ

హైదరాబాద్‌‌ / కొత్తగూడెం / ములుగు, వెలుగు:  కాళేశ్వరం అక్రమార్కులపై ఏసీబీ గురిపెట్టింది. ప్రాజెక్ట్‌‌లో కీలకంగా పనిచేసి అడ్డగోలుగా సంపాదించారనే ఆరోపణలు వస్తున్న ఇరిగేషన్ అధికారులపై కొరడా ఝులిపిస్తోంది. విజిలెన్స్, నేషనల్‌‌ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌‌డీఎస్‌‌ఏ) నివేదికల ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌లో కీలకంగా వ్యవహరించిన ఇంజినీర్‌‌‌‌ ఇన్ చీఫ్‌‌ (ఈఎన్‌‌సీ) భూక్యా హరిరాం ఆస్తుల లెక్కలు తీస్తోంది. హరిరాంపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. శనివారం ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. హరిరాం ఇండ్లు, ఆఫీసులతో పాటు బంధువుల ఇండ్లలో తనిఖీలు చేపట్టారు.

హైదరాబాద్ షేక్‌‌‌‌పేటలోని ఆదిత్య రాయల్ హోమ్స్‌‌‌‌లో ఉన్న హరిరాం విల్లాతో పాటు ఆయన సొంతూరు భద్రాది కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డ, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌‌‌‌, ములుగు, ఏపీలోని పుట్టపర్తి సహా మొత్తం 13 ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. ఉదయం 5:30 గంటలకు ప్రారంభమైన సోదాలు.. రాత్రి 8 గంటల వరకు కొనసాగాయి. సోదాలు ఆదివారం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాగా, హైదరాబాద్‌‌‌‌లోని విల్లాలో హరిరాం, ఆయన భార్య అనిత (ఇరిగేషన్ శాఖలో డిప్యూటీ ఈఎన్సీ) సమక్షంలోనే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ముందుగా వాళ్ల మొబైల్‌‌‌‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు మినహా ఇతరులను ఇంట్లోకి అనుమతించలేదు. 

జలసౌధలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ డాక్యుమెంట్లు..

హరిరాం నివాసంతో పాటు జలసౌధలోని ఆయన చాంబర్‌‌‌‌, సెక్షన్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్‌‌‌‌ తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచే సోదాలు నిర్వహించారు. వాలంతరీ డీజీగా పనిచేస్తున్న హరిరాం భార్య అనిత పేరిట మర్కుక్‌‌‌‌లో ఆస్తులు ఉన్నట్టు మూడు డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. అవి ఓ నిర్మాణ సంస్థకు చెందిన ప్రాజెక్టు మేనేజర్‌‌‌‌ నుంచి హరిరాంకు అందినట్టు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. అనిత పేరిట ఉన్న 28 ఎకరాల భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మర్కుక్ మండలంలో  కొండపోచమ్మ సాగర్ నిర్మాణం హరిరాం ఆధ్వర్యంలోనే జరిగింది. అదే సమయంలో ఓ నిర్మాణ సంస్థ నుంచి పెద్ద మొత్తంలో ఆయనకు లబ్ధి చేకూరినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. 

ఇరిగేషన్‌‌‌‌ శాఖలో భార్యాభర్తలు కీ రోల్‌‌‌‌.. 

హరిరామ్ ప్రస్తుతం కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా, గజ్వేల్‌‌‌‌ ఈఎన్సీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య అనిత ఇరిగేషన్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో డిప్యూటీ ఈఎన్సీగా, వాలంతరిలో డైరెక్టర్‌‌‌‌ జనరల్‌‌‌‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో హరిరామ్‌‌‌‌ కీలకపాత్ర పోషించారు. తొలుత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి సీఈగా పనిచేసిన ఆయన.. ఆ తర్వాత కాళేశ్వరం సీఈగా కొన్నాళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో మూడు బ్యారేజీల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సైట్ మార్పులు ఆయన సీఈగా ఉన్నప్పుడే జరిగినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుకు కీలక అనుమతులు సాధించడంలోనూ ఆయనది కీలక పాత్ర . ఆ తర్వాత ఆయన్ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం గజ్వేల్ ఈఎన్సీగా ప్రమోట్ చేసింది. ప్రస్తుతం గజ్వేల్ ఈఎన్సీగా ఉన్న ఆయన పరిధిలో మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మసాగర్, బస్వాపూర్ వంటి కీలక రిజర్వాయర్లు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ 10 నుంచి 16 వరకు ఆయన పరిధిలోనే ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థిక అవసరాల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌‌‌‌కు ఎండీగా కూడా ఆయనే ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఆయన ఎండీగా నియామకం కాగా.. ప్రాజెక్టుకు సంబంధించిన రుణాల వ్యవహారాల్లోనూ ఎండీగా ఆయన కీలకంగా వ్యవహరించారు.

 ఏసీబీ గుర్తించిన ఆస్తులు ఇవే..

హైదరాబాద్‌‌‌‌లోని షేక్‌‌‌‌పేట, కొండాపూర్‌‌‌‌‌‌‌‌లో విల్లాలు, శ్రీనగర్ కాలనీ, మాదాపూర్‌‌‌‌‌‌‌‌, నార్సింగిలో  ఫ్లాట్లు, పటాన్‌‌‌‌చెరులో 20 గుంటలు, శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్‌‌‌‌ ఇండ్లు, బొమ్మలరామారంలో ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌, 6 ఎకరాల మామిడితోట, కుత్బుల్లాపూర్‌‌‌‌‌‌‌‌, మిర్యాలగూడలో రెండు ఓపెన్ ప్లాట్లు, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌‌‌‌, ఏపీలోని అమరావతిలో కమర్షియల్ స్పేస్‌‌‌‌, సిద్దిపేట జిల్లా మార్కుక్‌‌‌‌లో 28 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంక్ డిపాజిట్లు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.