బంగ్లాదేశ్ కోర్టు ఆదేశాలతో హసీనాపై మర్డర్​ కేస్

బంగ్లాదేశ్ కోర్టు ఆదేశాలతో హసీనాపై మర్డర్​ కేస్

​ ఢాకా: రిజర్వేషన్ల వివాదం ముదరడంతో దేశం వీడి భారత్​లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్​ మాజీ ప్రధానిపై మర్డర్​కేసు నమోదైంది. ఆమెతోపాటు మరో ఆరుగురు మంత్రులు, అధికారులపై ఎఫ్ఐఆర్​ఫైల్​ అయ్యింది. ఈమేరకు బంగ్లాదేశ్​ లోకల్​ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బంగ్లాదేశ్​ రిజర్వేషన్ల అంశం హింసాత్మకంగా మారడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఖ్య ఇప్పటివరకు 500 దాటింది. అయితే, జులై 19న జరిపిన కాల్పుల్లో ఒక కిరాణా దుకాణం యజమాని అబుసయ్యద్‌‌‌‌ కూడా మరణించాడు. 

అతడి మరణానికి షేక్ హసీనాను బాధ్యురాలిగా పేర్కొంటూ అతడి కుటుంబ సభ్యుల తరపున ఒకరు కోర్టును ఆశ్రయించారు. బంగ్లాదేశ్ చట్టం ప్రకారం నిందితులపై హత్య కేసు నమోదు చేయాలని ఢాకా మెట్రోపాలిటన్ కోర్టు పోలీసులను ఆదేశించినట్టు ఆ వ్యక్తి తరఫు న్యాయవాది మమ్మున్​ మియ్యా తెలిపారు. దీంతో పోలీసులు హసీనాతో పాటు మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్‌‌‌‌ ఖాన్‌‌‌‌ కమల్‌‌‌‌, మాజీ ఐజీ అబ్దుల్లా అల్‌‌‌‌ మామున్‌‌‌‌, అవామీ లీగ్‌‌‌‌ పార్టీ జనరల్‌‌‌‌ సెక్రటరీ ఒబైదుల్‌‌‌‌ క్వాడర్‌‌‌‌ సహా మరికొందరిపై ఎఫ్‌‌‌‌ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు, దేశంలో మైనార్టీల రక్షణ కోసం తాత్కాలిక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మైనార్టీలపై జరిగే దాడులకు సంబంధించిన సమాచారం తెలిపేందుకుగానూ హాట్​లైన్​ను ఏర్పాటు చేసింది.

ధాకేశ్వరీ ఆలయానికి యూనస్

బంగ్లాదేశ్​లో దాడులు ఎదుర్కొంటున్న హిందువులను ధాకేశ్వరి ఆలయంలో ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్​ యూనస్​ మంగళవారం కలుసుకున్నారు. హిందువులు, వారి వ్యాపారాలపై దాడులు, ఆగస్ట్​ 5న షేక్​ హసీనా దేశం విడిచిపోయిన తర్వాత హిందూ ఆలయాల ధ్వంసం నేపథ్యం లో యూనస్​ హిందూ సమాజంతో భేటీ అయ్యారు. తమ ప్రభుత్వ పాత్రను నిర్ధారించే ముందు ఓపికతో ఉండాలని  కోరారు. “దేశంలో అందరికీ సమాన హక్కులుంటాయి. ఎలాంటి విభేదాలు లేవు. సహకరించండి. ఓపిక పట్టండి. మీకోసం మేం ఏంచేశాం.. ఏం చేయలేదో తర్వాత చెప్పండి.. ఏమీ చెయ్య కుంటే అప్పుడు విమర్శించండి” అని కోరారు.