- వైటీపీపీలో రూ.6.05 కోట్ల సామగ్రి ఎత్తుకెళ్లినట్టు కేసు
- కారులో ఎస్కార్ట్, పహారాతో హైదరాబాద్‌కు తరలింపు
- కేసు నుంచి బయట పడేందుకు కీలక సూత్రధారుల ప్రయత్నం
మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి మెటీరియల్ చోరీ చేసిన కేసులో పోలీసులు11 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో పాత, కొత్త దొంగలు కలిసి సుమారు రూ. 6.05 కోట్ల మెటీరియల్‌ను ఏడాదిన్నర పాటు పక్కా ప్లాన్‌తో మాయం చేశారు. బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో పనులు కొనసాగుతుండగా 2023 జూలైలో రూ. 98 వేల విలువైన బ్రాస్ సీడబ్ల్యూపీ లైన్ షాఫ్ట్ బేరింగులు, అదే ఏడాది అక్టోబర్ 31న రూ. 2.49 కోట్ల విలువైన బ్రైడెడ్ ఫిక్సబుల్ కనెక్షన్ మెటీరియల్, ఈ ఏడాది ఫిబ్రవరి 27న 2.81 కోట్ల అల్యూమినియం రోల్స్, ఇదే ఏడాది మరో సారి రూ. 2.80 లక్షల అల్యూమినియం రోల్స్, రూ. 71 లక్షల జీఐ షీట్ రోల్స్ ఎత్తుకెళ్లారు.
ఎస్కార్ట్‌గా ఉన్నవారికి రూ.15 వేలు
పవర్ ప్లాంట్ నుంచి మెటీరియల్‌ను చోరీ చేసి హైదరాబాద్ వరకు తరలించి అమ్మడంలో దొం గలు పక్కా ప్రొఫెషనల్స్‌లా వ్యవహరించారు. ముందు ప్లాంట్ నిర్మాణ పనుల మెటీరియల్ వద్ద డ్యూటీ చేసే కొంతమంది స్టాఫ్ సహకారంతో లోపలికి ప్రవేశించేవారు. అక్కడి మెటీరియల్ ను వాహనాల్లో లోడ్ చేసి తరలించే క్రమంలో ఇబ్బందులు రాకుండా ముందు కారులో ఎస్కార్ట్ ను ఏర్పాటు చేసుకునేవారు. పోలీసులు, తనిఖీలు లేవని నిర్ధారించుకొనే ముందుకు వెళ్లేవారు. ఎస్కార్ట్ గా ఉండి ప్లాంట్ నుంచి మిర్యాలగూడ బార్డర్ దాటించే వ్యక్తికి రూ.10 నుంచి 15 వేలు ఇచ్చేవారు. అంతేగాకుండా ఐదు కిలోమీటర్లకో వ్యక్తిని నియమించుకుని.. వారు సమాచారం ఇచ్చినందుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు ఇచ్చేవారు.
తప్పించుకునే యత్నాలు
మెటీరియల్ చోరీతో ప్రమేయమున్న ఓ పాత ఇనుము వ్యాపారం చేసే వ్యక్తితో సహా ఇతర కీలక సూత్రధారులు కేసు నుంచి బయటపడేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేయగా సంబంధం ఉన్న వారిని వదిలిపెట్టబోమని అంటున్నారు.