స్పిన్నర్‌.. బ్యాటర్‌గా ఎలా ఎదిగాడు: పాఠ్యంశంగా రోహిత్ శర్మ క్రికెట్ ప్రయాణం

స్పిన్నర్‌.. బ్యాటర్‌గా ఎలా ఎదిగాడు: పాఠ్యంశంగా రోహిత్ శర్మ క్రికెట్ ప్రయాణం

రోహిత్ శర్మ గురుంచి చెప్పాలంటే వరల్డ్ కప్‌కు ముందు.. ఆ తరువాత అని చెప్పుకోవాలి. ఈ మెగా టోర్నీలో అతని ఆట తీరు, భారత జట్టును నడిపిస్తున్న తీరు అద్భుతం. గతంలో పవర్ ప్లే అనగానే డిఫెన్స్ వైపు మొగ్గుచూపే హిట్‌మ్యాన్.. ధనాధన్‌ బ్యాటింగ్‌తో జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇస్తున్నాడు. ఈ క్రమంలో అతను వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఏమాత్రం చూసుకోవడం లేదు. ఈ ఆట తీరుతోనే కోట్లాది మంది మనసులు గెలుచుకుంటున్నాడు.

ఇదిలావుంటే, రోహిత్ శర్మ  క్రికెట్ ప్రయాణాన్ని పాఠ్యంశంగా చేర్చారు. 'ప్రతిభావంతులైడైన యువ బ్యాటర్' అని అప్పర్ ప్రైమరీ స్కూల్ పుస్తకంలో హిట్‌మ్యాన్‌పై ఒక అధ్యాయం ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆఫ్ స్పిన్నర్‌గా కెరీర్‌ ఆరంభించిన రోహిత్ బ్యాటర్‌గా ఎలా ఎదిగాడు దగ్గర నుంచి అతను సాధించిన వ్యక్తిగత మైలురాళ్లను కొన్నింటిని పొందుపరిచారు. 

పాఠ్యంశంలో ఉన్న అంశాలు

రోహిత్ శర్మ 30 ఏప్రిల్, 1987న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని బన్సోడ్‌లో జన్మించాడు. నిజానికి అతను బ్యాట్స్‌మెన్‌ అవ్వాలనుకోలేదు. ఆఫ్ స్పిన్నర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. కానీ అతని చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్.. రోహిత్ హిట్టింగ్ సామర్థ్యాన్ని గుర్తించి అతనిని బ్యాట్స్‌మెన్‌గా మార్చాడు. ఎందుకిలా చేశాడంటే.. జాయిన్ అయిన తొలి రెండు రోజుల్లోనే హిట్‌మ్యాన్ బౌలింగ్ లో ఎలాంటి ఉపయోగం లేదని దినేష్ లాడ్ పసిగట్టాడట. కోచింగ్ కోసం తన వద్దకు వచ్చే ఇతర పిల్లలతో కలిసి ప్రాక్టీస్ చేసే సమయంలో దినేష్ లాడ్ ఈ విషయాన్ని గుర్తించాడట. అదే సమయంలో రోహిత్ బ్యాటింగ్ నైపుణ్యాలను అతను పసిట్టాడట. డిఫెన్సివ్ టెక్నిక్స్, బంతిని బౌండరీకి తరలించే తీరు చూసి అతని ద్రుష్టి బ్యాటింగ్ వైపు మరల్చాడట. అలా స్పిన్నరైన మన రోహిత్ కాస్త బ్యాటర్‌ అయ్యాడట.    

ఒకానొక సమయంలో రోహిత్ శర్మ తల్లిదండ్రులు అతని స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో అతని క్రికెట్ సామర్థ్యం కారణంగా స్కాలర్‌షిప్ ఇవ్వబడింది అని అతని కుటుంబ పరిస్థితులు, విధ్యాబ్యాసం గురుంచి పొందుపరిచారు. 

ఇక అతని క్రికెట్ కెరీర్ విషయానికొస్తే.. 2013లో ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో అరంగేట్రం చేసిన రోహిత్.. తన తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఆపై హిట్‌మ్యాన్ శ్రీలంక బౌలర్లను చిత్తు చేస్తూ 173 బంతుల్లో 264 పరుగులతో విధ్వంసం సృష్టించిన ఇన్నింగ్స్ ను పొందుపరిచారు. అయితే ఇది ఏ తరగతి, ఏ స్కూల్ పాఠ్యంశంలో ఉందన్న వివరాలు తెలియరాలేదు.