రన్​వేపై చిరుత చిక్కింది.. శంషాబాద్ ఎయిర్​పోర్టులో ఆపరేషన్​ చిరుత సక్సెస్​

రన్​వేపై చిరుత చిక్కింది.. శంషాబాద్ ఎయిర్​పోర్టులో ఆపరేషన్​ చిరుత సక్సెస్​
  • ఊపిరి పీల్చుకున్న చుట్టుపక్కల గ్రామాల రైతులు

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్​పోర్టు పరిసరాల్లో సంచరిస్తున్న చిరుత పులి ఎట్టకేలకు చిక్కింది. ఐదు రోజులుగా ఎయిర్​పోర్టు, ఫారెస్ట్ ఆఫీసర్లకు కంటి మీద కునుకు లేకుండా చేసి.. గురువారం రాత్రి రన్​వే పక్కన ఏర్పాటు చేసిన బోనులో పడింది. గత ఆదివారం గొల్లపల్లి మీదుగా శంషాబాద్ ఎయిర్​పోర్టు వైపు వచ్చిన చిరుత, ఫెన్సింగ్​దూకి రన్ వే వైపు వచ్చింది. ఫెన్సింగ్​దూకే సమయంలో సెక్యూరిటీ అలారమ్ మోగడంతో సిబ్బంది సీసీ కెమెరాలను పరిశీలించారు. ఎయిర్​పోర్టు పరిసరాల్లోకి చిరుత ప్రవేశించినట్లు గుర్తించారు.

వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎయిర్​పోర్టు, ఫారెస్ట్​ఆఫీసర్లు కలిసి రన్​తోపాటు చుట్టుపక్కల 20కి పైగా ట్రాప్ కెమెరాలు, 5 బోన్లు ఏర్పాటు చేశారు. చిరుతపులిని ట్రాప్​చేసేందుకు బోన్ల వద్ద ఐదు మేకలను ఉంచారు. నాలుగు రోజులుగా చిరుతపులి బోన్ల వద్దకు వస్తూ.. పోతూ ఉంది కానీ బోనులోనికి వెళ్లే ప్రయత్నం చేయలేదు.

గురువారం రాత్రి 8 గంటలకు మరోసారి రన్​వే పక్కన ఏర్పాటు చేసిన బోను వద్దకు వచ్చింది. దాదాపు15 నిమిషాలపాటు బోను చుట్టుపక్కల తిరిగింది. చివరికి మేకను తినేందుకు ప్రయత్నించి బోనులో చిక్కింది. గుర్తించిన అధికారులు శుక్రవారం ఉదయం చిరుత చిక్కిన బోను వద్దకు వెళ్లి పరిశీలించారు. ఫారెస్ట్ అధికారులు చిరుతను జూపార్కుకు తరలించారు. రెండు రోజులపాటు చిరుత ఆరోగ్య పరిస్థితి పరిశీలించి, మంచిగా ఉందనుకుంటే ఆమ్రాబాద్ రిజర్వ్​ఫారెస్ట్ లో వదిలేస్తామని జూపార్కు అధికారులు తెలిపారు. 

మేకలు, పచ్చి మాంసం ఎరగా..

గురువారం రాత్రి 8 గంటల తర్వాత చిరుత బోనులో చిక్కిందని శంషాబాద్ జోన్ ఫారెస్ట్ ఆఫీసర్ విజయానంద్ తెలిపారు. బోనులో మేకతోపాటు పచ్చి మాంసాన్ని ఉంచామని, మేక అరుపులు విన్న చిరుత బోను వద్దకు వచ్చిందని చెప్పారు. దాదాపు 15 నిమిషాలు బోను పరిసరాల్లో తిరిగి, చివరికి మేకను తినడానికి లోనికి వెళ్లిందన్నారు. పట్టుబడిన చిరుత మగదని, వయస్సు మూడేండ్లు ఉంటుందని వెల్లడించారు.

18 ఎకరాల విస్తీర్ణంలోని చిట్టడవిలో ఏడు అడుగుల ఎత్తులో గడ్డి ఉందని, పైగా నీటి కొరత లేకపోవడంతో కిలోమీటర్ రేడియస్​లోనే చిరుత సంచరించిందని చెప్పారు. ఐదు రోజులపాటు నెమళ్లు, అడవి పందులు, కుందేళ్లను చిరుత ఆహారంగా తీసుకుందని వెల్లడించారు. డీఎఫ్ఓ సుధాకర్​రెడ్డి మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా చిరుత సంచారాన్ని గుర్తించామని చెప్పారు. మొదట మూడు, తర్వాత మరో రెండు బోన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎయిర్​పోర్టు అధికారుల సంపూర్ణ సహకారంతో ‘ఆపరేషన్ చిరుత’ సక్సెస్​అయిందన్నారు. చిరుత ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందన్నారు.