- యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన
చౌటుప్పల్, వెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని ఎస్వీ ల్యాబ్ లో బుధవారం రాత్రి కెమికల్ రియాక్టర్ లీకయ్యింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరు అస్వస్థతకు గురయ్యారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కృష్ణారావు పాలెంకు చెందిన నాగరాజు(34) నాలుగేండ్లుగా ఎస్వీ లాబ్స్‌లో బ్లాక్ ఇన్చార్జ్గా పనిచేస్తున్నారు. డ్యూటీలో భాగంగా రాత్రి 7 గంటలకు నాగరాజు రియాక్టర్లో రసాయనాలను వేస్తుండగా ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై కింద పడిపోయాడు. అదే సమయంలో అక్కడే ఉన్న లింగస్వామి కూడా అస్వస్థతకు గురయ్యాడు.
సమాచారం అందుకున్న కంపెనీ తోటి కార్మికులు బాధితులను బయటకు తీసుకువచ్చారు. అయితే, అప్పటికే పరిశ్రమలో వినియోగిస్తున్న రసాయనాల గాఢత కారణంగా నాగరాజు మృతి చెందారు. తీవ్ర అస్వస్థతకు గురైన లింగస్వామిని హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ బంధువులు చేసిన డిమాండ్ మేరకు యాజమాన్యం 75 లక్షల నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చింది. పరిశ్రమ యాజమాన్యం సరైన భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది.
గాఢ కెమికల్స్ తో ఉత్పత్తులు చేసే సమయంలో పీవీసీ కిట్లతోపాటు బ్రీతింగ్‌ను అందించే పరికరాలను వాడాల్సి ఉంటుంది. కానీ, అలాంటి ప్రమాణాలు ఏవి పాటించకపోవడంతోనే నాగరాజు చనిపోయినట్లు సమాచారం. కాగా.. ఇకనైనా అధికారులు సంబంధిత పరిశ్రమలో తనిఖీలు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలు పాటించకుంటే పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని కోరారు.