నాలుగు కాళ్లతో పుట్టిన కోడి పిల్ల.. బర్డ్ ఫ్లూ ఎఫెక్టేనా.. ?

నాలుగు కాళ్లతో పుట్టిన కోడి పిల్ల.. బర్డ్ ఫ్లూ ఎఫెక్టేనా.. ?

బర్డ్ ఫ్లూ వల్ల జనం చికెన్ కొనడం మానేశారు.. కానీ, ఫ్రీగా చికెన్ పంపిణీ చేస్తే మాత్రం ఎగబడి తింటున్నారు జనం. బర్డ్ ఫ్లూ వల్ల జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు పౌల్ట్రీ యజమానులు నిర్వహిస్తున్న ఫ్రీ చికెన్ మేళాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా నాలుగు కాళ్లతో పుట్టిన వింత కోడి పిల్ల జనాన్ని భయపెడుతోంది.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది ఈ వింత.. ఓ కోడి పిల్ల నాలుగు కాళ్లతో పుట్టింది. వింతగా పుట్టిన ఈ కోడి పిల్లను చూడటానికి జనం ఎగబడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండలం, రాఘబోయినగూడెం లో ఓ కోడి నాలుగు కాళ్లతో కోడి పిల్ల జన్మించింది. ఈసాల పగడయ్య అనే గిరిజన ఆదివాసి వ్యక్తి ఇంట్లో పది రోజుల క్రితంపుట్టింది ఈ వింత కోడి పిల్ల. 20 గుడ్లపై పొదిగిన కోడి 15 పిల్లలకు జన్మనిచ్చిందని... అందులో ఒక కోడి పిల్ల నాలుగు కాళ్ళతో  జన్మించిందని యజమాని తెలిపారు. 

ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ఈ అరుదైన సంఘటన పట్ల వింత జీవిగా భావించి జనం తండోపతండాలుగా వచ్చి చూస్తున్నారు. బర్డ్ ఫ్లూ తరహాలో కొత్త వైరస్ ఏమైనా వచ్చిందా అని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.నాలుగు కాళ్లతో కోడి పిల్ల పుట్టడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నారు. పశువైద్యులు ఈ కోడి పిల్లను పరిశీలించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు గ్రామస్థులు.