ఇంకా ఆదిమ యుగంలోనే ఉన్నామా..? బాల్య వివాహం చేసుకుని.. చిన్నారిని భుజాలపై ఎత్తుకెళ్లిన పెళ్లికొడుకు

 ఇంకా ఆదిమ యుగంలోనే ఉన్నామా..? బాల్య వివాహం చేసుకుని.. చిన్నారిని భుజాలపై ఎత్తుకెళ్లిన పెళ్లికొడుకు

ప్రపంచం రాకెట్లు, రోబోలు దాటి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) యుగంలోకి అడుగు పెట్టినా దేశంలో కొన్ని చోట్ల ఆదిమకాలపు అరాచకాలు ఆగడం లేదు. తాజాగా ఒక చిన్నారిని బాల్య వివాహం చేసుకుని.. ఏడుస్తున్నా భుజాలపై ఎత్తుకుని వెళ్లిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. భుజాలపై ఎత్తుకుని వెళ్తున్న పెళ్లికొడుకుకు పెద్దలు సహకరించడం, ఆ చిన్నారి రోదనను పట్టించుకోక పోవడం చూస్తుంటే సమాజం ఇంకా అక్కడే ఉందా అన్న అనుమానం రాక తప్పదు.

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో జరిగింది ఈ ఘటన. హోసూర్ గ్రామానికి చెందిన 14 ఏళ్ల చిన్నారిని బెంగుళూరులోని 29 ఏళ్ల అబ్బాయికిచ్చి బాల్య వివాహం చేశారు కుటుంబ సభ్యులు. చట్ట ప్రకారం బాల్య వివాహం చెల్లదన్న విషయం మరిచి ఇంతటి దారుణానికి పాల్పడ్డారు. 

పెళ్లి తర్వాత అమ్మాయిని తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో అత్తగారి ఇంటికి వెళ్ళనని ఆ చిన్నారి ప్రతిఘటించింది. అమ్మాయి వెళ్లనని తెగేసి చెప్పడంతో బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. చివరికి చిన్నారి ఏడుస్తున్నా పట్టించుకోకుండా భుజాలపై ఎత్తుకొని తీసుకెళ్లారు. ఘోరంగా రోదిస్తున్న చిన్నారిని పెళ్లి కొడుకు బలవంతంగా భుజాలపై ఎత్తుకుని తీసుకెళ్తుండగా.. తల్లి దండ్రులు పెద్దలు అందుకు సహాయం చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది.

స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదే విధంగా పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు భర్తను, భర్త తమ్ముడిని, బాలిక తల్లిని అదుపులోకి తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.