
డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబసభ్యుల ఆందోళన
షాద్‌నగర్, వెలుగు : న్యుమోనియాతో బాధపడుతున్న ఓ చిన్నారి హాస్పిటల్లో వైద్యం పొందుతూ చనిపోయాడు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపించారు. చిన్నారి తరఫు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పటణంలోని రాంనగర్ కాలనీకి చెందిన నరేందర్, కీర్తన దంపతులకు 4 నెలల కిందట బాబు పుట్టాడు. రెండ్రోజుల క్రితం చిన్నారికి తీవ్రమైన జలుబు, దగ్గు రావడంతో సోమవారం పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్లో చూపించారు. మెడికల్ టెస్టులు చేసిన డాక్టర్లు పిల్లాడికి న్యూమోనియా ఉందని చెప్పి.. స్టార్ కిడ్జ్ చిల్డ్రన్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. దీంతో బాబును మధ్యాహ్నం 12 గంటలకు ఆ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు.
వైద్య ఖర్చుల నిమిత్తం రూ.50 వేలు అవుతుందని స్టార్ కిడ్జ్ మేనేజ్మెంట్ తెలుపగా, మేము హైదరాబాద్ తీసుకెళ్తామని పిల్లాడి తల్లిదండ్రులు చెప్పారు. దీంతో రూ.30 వేలకు అక్కడే ట్రీట్మెంట్ చేస్తామని స్టార్ కిడ్జ్ మేనేజ్ మెంట్ వారిని ఒప్పించింది. చిన్నారిని అబ్జర్వేషన్ రూమ్‌లోకి తీసుకెళ్లి కాలయాపన చేయడంతో తమ కుమారుడు చనిపోయాడని, ఆ విషయాన్ని తమకు చెప్పకుండా హాస్పిటల్ మేనేజ్ మెంట్ ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చి బందోబస్తు ఏర్పాటు చేసుకుందని తల్లిదండ్రులు వాపోయారు. దీంతో వారి బంధువులు హాస్పిటల్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈ హాస్పిటల్లో ఇదివరకు కూడా ఇలాంటి ఘటనలు జరిగినట్లు తెలిపారు. రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. పోలీసులు కలుగజేసుకుని వారికి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించుకున్నారు.