ఇరువర్గాల గొడవ.. లంగర్ హౌస్ పరిధిలో వ్యక్తి మృతి

ఇరువర్గాల గొడవ.. లంగర్ హౌస్ పరిధిలో వ్యక్తి మృతి

మెహదీపట్నం, వెలుగు: రెండు గ్రూపుల మధ్య ఘర్షణలో ఒకరు మృతి చెందారు. లంగర్ హౌస్ పీఎస్​పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. టోలిచౌకీ సూర్యనగర్ కాలనీకి చెందిన ఇబ్రహీం అలీ అలియాస్ కిజర్ (30) తన ముగ్గురు ఫ్రెండ్స్ సత్తార్, జహంగీర్, మీరాజ్ తో కలిసి ఈ నెల 15న తెల్లవారుజామున కారులో వెళ్తున్నాడు. నానల్ నగర్ ఒలియో హాస్పిటల్ చౌరస్తాలో వెనుక నుంచి మరో కారులో సంగారెడ్డి ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ అక్బరుద్దీన్ అలియాస్ బద్దాదుతో పాటు ఫయాజ్ ఖాన్, ఫయాజ్, రెహాన్, మోసిన్, ఉమర్ ఆరుగురు కలిసి మరో కారులో వస్తున్నారు.

ఈ రెండు గ్రూపులు కార్లలో పెద్ద శబ్దంతో పాటలు పెట్టుకొని వెళ్తున్నారు. ఈ క్రమంలో సౌండ్ తక్కువ పెట్టమని ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ముందు కారులో ఉన్న ఇబ్రహీం అలీని అక్బరుద్దీన్ తన మిత్రులతో కలిసి కొట్టాడు. దీంతో ఇబ్రహీం ఛాతీలో నొప్పితో కిందపడగా, ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇబ్రహీం మృతి చెందగా, 16న కుటుంబసభ్యులు అంత్యక్రియలు కూడా నిర్వహించారు.

అయితే, ఇబ్రహీం అలీని ఛాతిలో కొట్టడంతోనే గుండెపోటు వచ్చిందని, తోటి మిత్రులు చెప్పడంతో బాధితులు ఈ నెల18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు రౌడీషీటర్ అక్బరుద్దీన్ తో పాటు అతని స్నేహితులును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే, డెడ్​బాడీని వెలికితీసి పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తామని పోలీసులు తెలిపారు.