గంజాయి తాగను అన్నందుకు తోటి స్టూడెంట్​ను చావబాదిన్రు

నిజామాబాద్, వెలుగు: గంజాయి తాగనని చెప్పిన క్లాస్‌‌మేట్‌‌ను తోటి విద్యార్థులు చావబాదారు. చేతి కడేలతో ఇష్టమొచ్చినట్టు కొట్టడంతో అతను స్పృహ కోల్పోయాడు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కల్లెడ జడ్పీ హైస్కూల్‌‌లో ఈనెల 16న ఈ ఘటన జరిగింది. స్టూడెంట్ తల్లి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో వేరే స్కూలులో చదువుకున్న తమ కొడుకును ఈ ఏడాది గ్రామంలోని జిల్లా పరిషత్ స్కూల్‌‌లో టెన్త్‌‌లో పేరెంట్స్ చేర్పించారు. అయితే అదే క్లాస్‌‌కు చెందిన కొందరు గంజాయికి అలవాటుపడ్డారు. ఈ క్రమంలో గంజాయి తాగాలంటూ బాధిత బాలుడిని తరచూ ఒత్తిడి చేస్తున్నారు. 

విషయం తన తల్లికి చెప్పిన బాధితుడు.. తనను వేరే స్కూల్‌‌లో చేర్పించాలని కోరాడు. మధ్యలో బడి మార్చడం సాధ్యం కాదని తల్లి సముదాయించడంతో అదే స్కూల్​కి వెళ్తున్నాడు. గత శనివారం మధ్యాహ్నం గంజాయి మత్తులో ఉన్న ఆరుగురు విద్యార్థులు తమతో కలిసి గంజాయి తాగాలని బాలుడిని బెదిరించారు. టీచర్​కు చెబుతానని అతడు హెచ్చరించడంతో.. మాట్లాడుకుందామని స్కూల్ నుంచి బయటకు తీసుకెళ్లి దాడి చేశారు. 

చేతికి ధరించిన ఐరన్ కడేలతో కొట్టారు. దీంతో బాధితుడు స్పృహ కోల్పోయాడు. విషయం తెలిసి పేరెంట్స్‌‌.. కొడుకును నిజామాబాద్​లోని ఓ ఆస్పత్రి​లో చేర్పించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. కొడుకు పరిస్థితి మెరుగుకాకపోవడంతో గురువారం మాక్లూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దెబ్బల తీవ్రతకు బాలుడి తల, పక్కటెముకల్లో రక్తం గడ్డకట్టిందని డాక్టర్లు చెప్పారని అతని తల్లిదండ్రులు వెల్లడించారు.