
కామేపల్లి, వెలుగు : రాష్ట్రంలో అతిపెద్ద పశువుల సంతగా పేరొందిన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కొమ్మినేపల్లి పంచాయతీలోని పండితాపురం శ్రీకృష్ణ ప్రసాద్ పశువుల సంత వేలం రూ. కోట్లలో పలికి రికార్డు సృష్టించింది. సోమవారం సంత భవనంలో బహిరంగ వేలాన్ని పంచాయతీ అధికారులు నిర్వహించారు. పండితాపురం గ్రామానికి చెందిన భూక్య వీరన్న, బోడా శ్రీను, బానోత్ లక్ష్మ మధ్య పోటా పోటీగా వేలంపాట కొనసాగింది. చివరకు వీరన్న రూ.2,42, 30,000 కు దక్కించుకున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి రూ.36.20 లక్షలు అదనంగా ఆదాయం వచ్చిందని డీఎల్ పీఓ రాంబాబు, ఎంపీడీవో రవీందర్, పంచాయతీ కార్యదర్శి శంకర్ తెలిపారు. గురువారం వేలం నిర్వహించగా బోడ శ్రీను రూ . 35.70 లక్షలకు వేలంపాట పాడారు. కనీస మద్దతు ధర రాకపోవడంతో వేలాన్ని సోమవారానికి వాయిదా వేశారు.
వేలం పూర్తయిన తర్వాత బోడ శ్రీను అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుపట్టారు. తన పేరు మీద ఆరోజు పాట కొట్టేసి తిరిగి పెట్టడమేంటని..? అధికారులను ప్రశ్నించారు. కారేపల్లి రూరల్ సీఐ తిరుపతిరెడ్డి, ఎస్ఐ సాయికుమార్ వేలం సజావుగా సాగేటట్లు చూశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు కొనసాగించారు. కార్యక్రమంలో కామేపల్లి, ఏన్కూర్, తిరుమలాయ పాలెం, సింగరేణి మండల పంచాయతీ అధికారులు ప్రభాకర్ రెడ్డి, జీవీ నారాయణ, సూర్యనారాయణ, రవీంద్ర ప్రసాద్ పంచాయతీ కార్యదర్శులు ఫజల్, నెహ్రూ, వెంకటేశ్వర్లు, నాగేంద్రబాబు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.