- మూడు రోజుల నరకయాతన
- జ్వరాల బారిన పడ్డ కూంబింగ్ టీం
- నడవలేని స్థితికి చేరుకున్న పోలీసులు
- పెనుగోలు గుట్టల నుంచి హెలికాప్టర్లో తరలింపు
జయశంకర్ భూపాలపల్లి/వెంకటాపురం, వెలుగు : మావోయిస్టుల వేట కోసం రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ప్రాంతానికి కూంబింగ్ కోసం వెళ్లిన స్పెషల్ పోలీస్ టీం.. ఎన్‌కౌంటర్ ముగిసిన తర్వాత ఇంటిముఖం పట్టగా వర్షాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. వానలకు తడిసి జ్వరాల బారిన పడ్డారు. అడుగు తీసి అడుగు వేయలేని స్థితికి చేరుకుని ఛత్తీస్‌గఢ్ బార్డర్‌లోని పెనుగోలు గుట్టల్లోని అడవిలోనే ఆగిపోయారు. ఇది తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు హెలీకాప్టర్ పంపించి రక్షించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన వంద మందితో కూడిన స్పెషల్ పార్టీ పోలీసులు గురువారం తెలంగాణ‒ఛత్తీస్‌గఢ్ బార్డర్‌లో ఉన్న అడవిలోకి కూంబింగ్‌కు వెళ్లింది. శుక్రవారం సాయంత్రం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎల్మిడి పీఎస్ పరిధిలోని సీమలదొడ్డి సమీపంలో ఉన్న ఉరవసారి గుట్టల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య 15 నిమిషాలు కాల్పులు జరిగాయి. ఇందులో ఓ మావోయిస్టు చనిపోయాడు. ఆపరేషన్‌తర్వాత తిరిగి వస్తున్న పోలీసులకు వర్షం రూపంలో ఆపద ముంచుకొచ్చింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో కొండలు, గుట్టలు దిగుతూ నడక సాగించడం ఇబ్బందిగా మారింది.
అనుకూలమైన ప్రదేశంలో సేద తీరుతూ.. వర్షం తగ్గినప్పుడు ప్రయాణం చేస్తూ సుమారు 60 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలు సమీపంలో గుట్టలపైకి చేరుకున్నారు. వర్షానికి తడవడం వల్ల కొందరికి చలిజ్వరం వచ్చింది. మరికొందరు నడవలేని స్థితికి చేరుకున్నారు. విషయం తెలుసుకుని బ్యాక్ అప్ టీం వెళ్లగా పెనుగోలు వాగు ఉధృతంగా పొంగడంతో వారి ప్రయత్నం ఫలించలేదు. ఆదివారం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో హెలీకాప్టర్ సాయంతో వాజేడు మండలం మండపాకకు తీసుకొచ్చారు.
జ్వరం, కాళ్ల నొప్పులతో లేవలేని స్థితిలో ఉన్నవారిని హెలికాప్టర్ నుంచి ఇద్దరు, ఇద్దరు పోలీసులు తమ భుజాలపైకి ఎత్తుకొని తీసుకువెళ్లి పక్కనే ఉన్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లోకి ఎక్కించారు.తర్వాత రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లి వైద్య సేవలందజేస్తున్నారు.