రెడ్ హ్యాండెడ్‎గా ఏసీబీకి చిక్కిన కమర్షియల్​ ట్యాక్స్​ ఆఫీసర్

రెడ్ హ్యాండెడ్‎గా ఏసీబీకి చిక్కిన కమర్షియల్​ ట్యాక్స్​ ఆఫీసర్

పాలమూరు/గద్వాల, వెలుగు: జీఎస్టీ లైసెన్స్ కోసం ఓ వ్యాపారి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్, మహబూబ్​నగర్​ఏసీటీవో​వెంకటేశ్వర్ రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకున్నారు. మహబూబ్​నగర్  ఏసీబీ డీఎస్పీ కృష్ణయ్య గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మర్లు ప్రాంతంలో ఓ వ్యాపారి సీడ్స్ అండ్  స్క్రాప్  బిజినెస్ కోసం జీఎస్టీ లైసెన్స్‎కు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ వ్యాపారి నుంచి రూ.50 వేలు డిమాండ్ చేయగా, బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం మహబూబ్​నగర్​ కమర్షియల్​ ట్యాక్స్​ ఆఫీస్​లో రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా, వెంకటేశ్వర రెడ్డిని రెడ్​హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.

గద్వాలలో సోదాలు..

లంచం తీసుకుంటూ పట్టుబడిన వెంకటేశ్వర్ రెడ్డి స్వగ్రామం గద్వాల మండలం శెట్టి ఆత్మకూర్  కాగా, ఆయన గద్వాలలోని వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నారు. అతని ఇంట్లో నల్గొండ ఏసీబీ ఎస్ఐలు వెంకట్​రావు, రామారావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఏసీటీవో భార్య ప్రవీణ గద్వాల మండలం తెలుగోని పల్లె విలేజ్‎లో గవర్నమెంట్​టీచర్​గా పని చేస్తున్నారు. ఆమెను ఇంటికి పిలిపించి తనిఖీలు చేశారు. బ్యాంక్​ లాకర్‎కు సంబంధించిన కీ, బ్యాంక్​ పాస్  బుక్స్​ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఏసీబీ ఆఫీసర్లు సోదాలు నిర్వహించారు.