
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమ చరిత్రలో మిలియన్ మార్చ్ అపురూప ఘట్టమని ఎమ్మెల్సీ, టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆ కార్యక్రమంలో లక్షలాది తెలంగాణ బిడ్డలు స్వచ్ఛందంగా ట్యాంక్ బండ్ మీదికి చేరుకొని విజయవంతంగా నిర్వహించారని గుర్తుచేసుకున్నారు. ఉద్యమ చరిత్రపై కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మిలియన్ మార్చ్ తర్వాతనే తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టమైన మిలియన్ మార్చ్ జరిగి 14 ఏండ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం గన్ పార్క్లో ఉద్యమకారులు, నేతలు అమరులకు నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాంతో పాటు మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ అభ్యర్థులు అద్దంకి దయాకర్, విజయశాంతి, పీఓడబ్ల్యూ సంధ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉద్యమ జ్ఞాపకాలను, మిలియన్ మార్చ్ ఘటనలను నేతలు గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ.. మిలియన్ మార్చ్ ఉద్వేగ భరితమైన రోజు అని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర వక్రీకరించే ప్రయత్నం జరుగుతున్నదని, రాష్ట్ర ప్రభుత్వమే కాపాడాలని కోరారు.
ఏ ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదని.. అందరూ సమిష్టిగా పోరాడితేనే వచ్చిందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర వక్రీకరణకు గురికాకుండా.. ప్రత్యేక కమిటీ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోదండరాం కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు నాటి అమరవీరుల త్యాగం మరవలేనిదని, వారి ఆత్మా స్థైర్యం, స్ఫూర్తిని అందరూ గుండె లోతుల్లో నిలుపుకోవాలన్నారు. ఉద్యమ ఆకాంక్షల సాధనకై అమరుల స్ఫూర్తితో ముందుకెళ్దామన్నారు.