సమగ్ర భూసర్వేనే పరిష్కారం

సమగ్ర భూసర్వేనే పరిష్కారం
  • దశలవారీగా నిర్వహిస్తేనే గెట్టు పంచాయితీలకు తెర
  • కరీంనగర్‌‌, మంచిర్యాల కలెక్టరేట్లలో అభిప్రాయ సేకరణ
  • రైతుల కోసమే కొత్త చట్టం : కరీంనగర్‌‌ కలెక్టర్‌‌ పమేలా సత్పతి

కరీంనగర్/మంచిర్యాల, వెలుగు:  సమగ్ర భూ సర్వే ద్వారానే భూ సమస్యలు పరిష్కారం అవుతాయని వివిధ వర్గాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.ఈ విధానాన్ని దశల వారీగా అమలు చేస్తే గెట్టు పంచాయితీలు తగ్గుతాయని చెప్పారు. బీఆర్‌‌ఎస్‌‌ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌‌ వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి జరిగిన నష్టాన్ని సరిదిద్దాలని కోరారు. తెలంగాణ ఆర్‌‌వోఆర్‌‌ ముసాయిదాబిల్లు-2024పై కరీంనగర్, మంచిర్యాల కలెక్టరేట్లలో శనివారం ఆయా జిల్లాల కలెక్టర్లు పమేలా సత్పతి, కుమార్‌‌ దీపక్‌‌ అధ్యక్షతన చర్చా కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సమావేశానికి లాయర్లు, రిటైర్డ్‌‌ రెవెన్యూ ఆఫీసర్లు, ఉద్యోగ, రైతు సంఘాల ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించారు. భూసమస్యలు లేకుండా కొత్త రెవెన్యూ చట్టాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. వందేళ్ల కింద నిజాం కాలంలో సమగ్ర భూసర్వే నిర్వహించారని ఆ తర్వాత మళ్లీ నిర్వహించకపోవడంతో రైతుల మధ్య గెట్టు సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. సమగ్ర భూసర్వే చేయించి భూమి, రికార్డులు సరిపోలేలా ఉండేలా చూడాలని కోరారు. అనంతరం కరీంనగర్‌‌ కలెక్టర్‌‌ పమేలా సత్పతి మాట్లాడుతూ రైతులకు మేలు చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందిస్తుందన్నారు. సేవలు సులభంగా, వేగంగా అందడంతో పాటు రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. ఒకరిద్దరి అవసరాలకు కాకుండా భవిష్యత్‌‌తరాలకు ఉపయోగపడేలా రికార్డ్‌‌ ఆఫ్‌‌ రైట్స్‌‌ (ఆర్‌‌వోఆర్‌‌) చట్టం-2024 ముసాయిదా ఉందన్నారు. కొత్త చట్టంలో అధికారాల వికేంద్రీకరణ కారణంగా ప్రజలకు గ్రామ, మండల స్థాయిలోనే సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. 

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌‌ వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని సుడా చైర్మన్‌‌ కోమటిరెడ్డి నరేందర్‌‌రెడ్డి అన్నారు. కొత్త చట్టాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రిటైర్డ్ తహశీల్దార్లు ఆంజనేయులు, చంద్రయ్య మాట్లాడుతూ గతంలో భూరికార్డుల ప్రక్షాళన సమయంలో చాలా అవకతవకలు జరిగాయని, వాటిని సరిదిద్దాలని కోరారు. రికార్డులను పారదర్శకంగా నిర్వహించాలని, ప్రతీ సంవత్సరం జమాబందీ నిర్వహించాలని సూచించారు. కరీంనగర్‌‌ అడిషనల్‌‌ కలెక్టర్లు లక్ష్మీకిరణ్‌‌, ప్రపుల్‌‌ దేశాయ్‌‌, ట్రైనీ కలెక్టర్‌‌ అజయ్‌‌ యాదవ్‌‌, డీఆర్వో పవన్‌‌కుమార్‌‌, ఆర్డీవోలు మహేశ్వర్, రమేస్‌‌, టీఎన్జీవోస్‌‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌‌రెడ్డి, రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్లు అంజయ్య, కేశవులు పాల్గొన్నారు.

  • డీఎం సునీల్ మాట్లాడుతూ మిస్సింగ్‌‌ సర్వే నంబర్లకు మీ సేవలోనే ఏదో ఒక నంబర్‌‌ వల్ల వల్ల సమస్యలు వస్తున్నాయన్నారు. దీనికి పరిష్కారం చూపాలని, లావనీ పట్టాలకు విరాసత్ చేయాలని కోరారు. ప్రొహిబిటెడ్‌‌ ల్యాండ్స్‌‌కు తీన్సాల్‌‌ పహాణీ, లేదా కాస్రా పహాణీ దేనిని ప్రామాణికంగా తీసుకోవాలన్నది క్లారిటీ ఇవ్వాలన్నారు. మీసేవలో స్లాట్ బుక్‌‌ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్‌‌ క్యాన్సిల్‌‌ అయితే డబ్బులు వాపస్‌‌ రావడం లేదని,  అందువల్ల రిజిస్ట్రేషన్‌‌ పూర్తయిన  తర్వాతే ఫీజు చెల్లించేలా మార్పులు చేయాలన్నారు. 
  • హాజీపూర్‌‌కు చెందిన పూస్కూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘ఎక్సెస్‌‌ ల్యాండ్‌‌కు సంబంధించిన సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఒక సర్వేనంబర్‌‌లో ఫిజికల్‌‌గా ఉన్న భూమి కంటే రికార్డుల్లో ఎక్కువగా నమోదైనప్పుడు మొత్తం సర్వేనంబర్‌‌ను సర్వే చేయడం కష్టం. దీనికి సరైన పరిష్కారం చూపించాలి’ 
  • అని కోరారు.
  • మాత అనేది సంస్కృత పదం, కాబట్టి భూమాత పోర్టల్ ను ‘భూదేవి’గా మార్చాలని మంచిర్యాలకు చెందిన రిటైర్డ్ లెక్చరర్ తుమ్మల మల్లారెడ్డి సూచించారు. పాత రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని, వీఆర్వో, వీఆర్ఏ, ఎంఆర్ఐలను, సర్వేయర్లను నియమించాలని కోరారు. 

సమగ్ర భూసర్వేతోనే సమస్యలకు పరిష్కారం 

తెలంగాణలో నిజాం హయాంలో భూసర్వే జరిగింది. 1930 తర్వాత ఎలాంటి సర్వేలు చేయలేదు. ఆనాటి సర్వే రికార్డులపైనే నేటికీ ఆధారపడుతున్నాం. ఈ మధ్యకాలంలో భూముల స్వరూపం చాలా మారింది. అప్పటి రికార్డులకు, ఇప్పుడు కేత్రస్థాయి పరిస్థితులకు పొంతన కలవడం లేదు. కావున ప్రభుత్వం దశలవారీగా సమగ్ర భూసర్వే చేపట్టాలి. ఫీల్డ్‌‌ సర్వే నిర్వహించకుండా భూసమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకదు.  – శ్రీనివాస్, ఏడీ సర్వే అండ ల్యాండ్‌‌ రికార్డ్స్‌‌

ఏటా జమాబందీ చేయాలి 

గతంలో ప్రతి సంవత్సరం జమాబందీ జరిగేది. దానివల్ల ఎప్పటికప్పుడు భూముల సమస్యలు పరిష్కారం అయ్యేవి. జమాబందీ లేకపోవడంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. కాబట్టి గ్రామం యూనిట్‌‌గా ఏటా జమాబందీ జరగాలి. ల్యాండ్‌‌ రికార్డ్స్‌‌ క్లాసిఫికేషన్‌‌ చేయాలి. కొత్త చట్టంలో అప్పీళ్లకు 30 రోజుల గడువు ఇచ్చారు. దీనిని 45 రోజులకు పెంచాలి. భూరికార్డులను ప్రభుత్వమే మెయింటేన్‌‌ చేయాలి. – బోజన్న, కాసీపేట తహసీల్దార్

సాదాబైనామాలకు పరిష్కారం 

ఈ చట్టంలో తహసీల్దార్లకు పరిమిత అధికారాలు ఉండాలి. ధరణి వల్ల చాలా మంది రైతులు నష్టపోయారు. ఆ తప్పులను సరిదిద్దాలి. గ్రామాలు, మండలాల్లో చెరువులు, కుంటలు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఇలాంటి ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్‌‌ కాకుండా ల్యాండ్‌‌ రిజిస్ట్రేషన్ మేనేజ్‌‌మెంట్‌‌ ఇన్ఫర్మేషన్‌‌ సిస్టమ్‌‌లో నమోదు చేయాలి. గత ప్రభుత్వం ఆర్‌‌వోఆర్‌‌ యాక్ట్ 1971ను రద్దు చేయడం వల్ల పెండింగ్‌‌లో ఉన్న సాదాబైనామాలు పరిష్కారం కాకుండాపోయాయి. కొత్త చట్టంలో వీటికి పరిష్కారం దొరకనుంది. -  కొరివి వేణుగోపాల్, అడ్వకేట్, ప్రజామిత్ర అధ్యక్షుడు 

విలేజ్‌‌, ఓనర్‌‌షిప్‌‌ పదాలకు వివరణ ఇవ్వాలి 

ప్రభుత్వ ప్రభుత్వం ధరణి లోపాలను సవరిస్తూ కొత్త చట్టాన్ని తీసుకురావడం హర్షణీయం. కొత్త చట్టంలో విలేజ్, సర్వేనంబర్, ఓనర్‌‌షిప్‌‌ వంటి పదాలకు సరైన డెఫినేషన్‌‌ ఇవ్వకపోవడం వల్ల భవిష్యత్‌‌లో సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి వాటికి డెఫినేషన్ ఇవ్వాలి. సాదాబైనామాల క్లియరెన్స్‌‌లో సమస్యలు రాకుండా రూల్స్‌‌ ఫ్రేమ్‌‌ చేయాలి. ప్రస్తుతం సక్సేషన్‌‌కు ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నారు. ఆ ఫీజును తగ్గించడమా, లేక బీపీఎల్‌‌ పరిధిలోకి వారికి ఫ్రీగా ఇవ్వడమా అనేది స్పష్టం చేయాలి. - కృష్ణ నాయక్, డిప్యూటీ తహసీల్దార్, మంచిర్యాల

ఇంటిగ్రేటెడ్‌‌ పోర్టల్ తీసుకురావాలి 

కొత్త రెవెన్యూ యాక్ట్‌‌లో భాగంగా ల్యాండ్‌‌ రికార్డుల్లోని తప్పులను సవరిస్తూ ఇంటిగ్రేటెడ్ వెబ్‌‌ ల్యాండ్‌‌ పోర్టల్‌‌ తీసుకురావాలి. అందులో ఎలాంటి తప్పుల్లేవని నిర్ధారించుకున్న తర్వాతే పబ్లిక్‌‌ డొమైన్‌‌లో పెట్టాలి. ల్యాండ్ రికార్డులను గ్రామాల వారీగా అప్‌‌డేట్‌‌ చేయాలి. ఒక సర్వేనంబర్‌‌లో ఎవరి భూమి హద్దులు వారికి చూపించాలి. ఒక సర్వే నంబర్‌‌లో పది ఎకరాలు ఉండి, అందులో రెండు ఎకరాలకు నాలా చేస్తే మిగిలిన ఎనిమిది ఎకరాలే ఆన్‌‌లైన్‌‌లో కనిపిస్తోంది. కానీ ఆ సర్వే నంబర్లలో ఎంత భూమి ఉందో తెలియాలంటే నాలా చేసిన విస్తీర్ణం కూడా ఆన్‌‌లైన్‌‌లో కనిపించాలి. – శ్రీనివాసరావు దేశ్‌‌పాండే, హాజీపూర్‌‌ తహసీల్దార్‌‌