మనువాద, బ్రాహ్మణీయ రాజకీయాలతో ..రాజ్యాంగానికి పెను ప్రమాదం

మనువాద, బ్రాహ్మణీయ రాజకీయాలతో ..రాజ్యాంగానికి పెను ప్రమాదం
  •     ఒకే దేశం, ఒకే మతం, ఒకే సంస్కృతి నినాదమే మోసపూరితం 
  •     రాజ్యాంగం సురక్షితంగా ఉండాలంటే పాలకులు మంచివాళ్లయి ఉండాలి 
  •     రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో వక్తలు

హనుమకొండ, వెలుగు : మనువాద, బ్రాహ్మణీయ రాజకీయాలతోనే రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఒకే దేశం, ఒకే మతం, ఒకే సంస్కృతి అనే నినాదమే మోసపూరితమైందని స్పష్టం చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని వరంగల్​ ప్రెస్​క్లబ్​లో శుక్రవారం ఉమ్మడి వరంగల్ ​జిల్లా ఇంటలెక్చువల్స్ ఫోరమ్​ ఆధ్వర్యంలో ‘రాజ్యాంగ పరిరక్షణలో ప్రజాప్రతినిధుల పాత్ర’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. దీనికి చీఫ్​ గెస్టులుగా వరంగల్ వెస్ట్​ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ ​రెడ్డి, ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి, సామాజిక విశ్లేషకుడు బొజ్జ భిక్షమయ్య

కాంగ్రెస్​ పార్టీ గ్రాడ్యుయేట్స్​ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్​ మల్లన్న హాజరయ్యారు. ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ రాజకీయాల్లో దిగజారుడుతనం పెరిగిపోయిందని, మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ప్రజల కోసం కొట్లాడిన తీన్మార్​ మల్లన్నను గత పాలకులు కేసుల పేరుతో ఇబ్బంది పెట్టారన్నారు. మనువాద బ్రాహ్మణీయ భావజాలం నుంచి  పుట్టొకొచ్చిన ప్రజాప్రతినిధుల వల్లే భారత రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందని ప్రధాన వక్త బొజ్జా భిక్షమయ్య అన్నారు. అలాంటివాళ్లకు సోషలిజం, సెక్యులరిజం, ప్రజాస్వామ్యం అంటే అసలే గిట్టదని, అందుకే ఆ పదాలను తొలగించాలని, వెనుకబడిన మైనార్టీలకు రిజర్వేషన్స్ ఉండొద్దని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. 

రాజ్యాంగాన్ని ముట్టుకుంటే కాంగ్రెస్​ ఊరుకోదు

రాజ్యాంగం సురక్షితంగా ఉండాలంటే పాలకులు మంచివాళ్లయి ఉండాలని కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్స్​ ఎమ్మెల్సీ ​అభ్యర్థి తీన్మార్​ మల్లన్న అన్నారు. గతంలో రాజ్యాంగాన్ని మార్చాలని కొందరంటే.. దేశంలో 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఇంకొందరు అంటున్నారని, అలాంటి వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. రాజ్యాంగాన్ని ఎవరు ముట్టుకున్నా కాంగ్రెస్ ​ఊరుకోదని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని మారుస్తామన్న పాలకులనే మార్చేసే ఉద్యమానికి కాంగ్రెస్ ​పార్టీ శ్రీకారం చుడుతోందన్నారు.

ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. చట్టసభలు ఏటా 90 రోజులైనా నడవాలని, కానీ, 15 రోజులకు మించి నడవడం లేదన్నారు. ప్రొఫెసర్  కూరపాటి వెంకట నారాయణ మాట్లాడుతూ రాజ్యాంగం మార్చాలన్న నేతలను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.మహమ్మద్ రియాజ్, కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి

 సామాజిక ఉద్యమకారిణి ప్రీతి దయాళ్, భారత్ బచావో హనుమకొండ చైర్మన్ రామబ్రహ్మం, ప్రొఫెసర్ వీరన్న, భారత్ బచావో నాయకులు డా.ఎం.వెంగల్ రెడ్డి, దొమ్మాటి ప్రవీణ్ కుమార్, వివిధ సంఘాల నాయకులు డా.మార్క శంకర్ నారాయణ, బర్ల ప్రవీణ్, వడ్డే రవీందర్, దరువు ఎల్లన్న పాల్గొని మాట్లాడారు.