భోపాల్ : ప్రేమ వ్యవహారంలో వచ్చిన మనస్పర్థల కారణంగా ఓ కానిస్టేబుల్.. ప్రియురాలు, ఆమె తండ్రి, సోదరుడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ప్రియురాలి తండ్రి తీవ్రంగా గాయపడి.. చనిపోయాడు. ప్రస్తుతం ప్రియురాలు, ఆమె సోదరుడు ఆస్పత్రిలో చావు బతులకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
అసలేం జరిగింది..?
దేవాస్‌లో పోలీసు డ్రైవర్‌గా పని చేస్తున్న సుభాష్ ఖరాడి (26), ఓ యువతి గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే.. ఇద్దరి మధ్య వచ్చిన విబేధాలతో ఖరాడికి దూరంగా ఉంటోంది యువతి. ఈ క్రమంలోనే మే 21వ తేదీ ఆదివారం అర్థరాత్రి యువతి ఇంటికి వెళ్లిన సుభాష్ ఖరాడి.. ప్రియురాలు, ఆమె తండ్రి, సోదరుడుపై వెంట తెచ్చుకున్న పిస్తోల్ (కంట్రీమేడ్ పిస్టల్ )తో కాల్పులు జరిపాడు. ఈ ఘటన షాజాపూర్ జిల్లాలోని మలిఖేడీలో జరిగింది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ యువతి తండ్రి జాకీర్ షేక్.. చనిపోగా..ప్రియురాలు, ఆమె సోదరుడు పరిస్థితి ప్రస్తుతం సీరియస్ గానే ఉందంటున్నారు డాక్టర్లు. యువతి పరిస్థితి సీరియస్ గా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఇండోర్ కు తరలించారు. మరోవైపు.. కాల్పులు జరిపిన తర్వాత ఘటనా స్థలం నుంచి నిందితుడు పారిపోయి.. దగ్గరలోని రైల్వేస్టేషన్ కు వెళ్లాడు. వేగంగా వస్తున్న రైలు ముందు నిల్చుని.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
షాజాపూర్ జిల్లాలో ప్రియురాలి ఇంటికి వెళ్లి.. కాల్పులు జరిపిన తర్వాత ఫేస్ బుక్ లో ఒక పోస్టు చేశాడు ఖరాడీ. గతంలో యువతితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను షేర్ చేశాడు. ‘‘ఆమె నాకు ద్రోహం చేసినందున నేను ఆమెను చంపాను. ఆమె ఎప్పటికీ మరచిపోలేని బాధను ఆమెకు ఇచ్చాను" అని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఈ పోస్టు చేసిన కొన్ని గంటల తర్వాత సుభాష్ ఖరాడి మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై గుర్తించారు.
ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడం వల్లే ఈ విషాద సంఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును వేగంగా విచారణ చేస్తామని షాజాపూర్ జిల్లా పోలీసు చీఫ్ యశ్‌పాల్ సింగ్ రాజ్‌పుత్ తెలిపారు.