గోదావరిఖని, వెలుగు: ఆన్‌లైన్ గేమ్స్, షేర్ మార్కెట్‌లో డబ్బులు పెడితే ఎక్కువ మొత్తంలో లాభం వస్తుందంటూ నమ్మించిన ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ మరో ప్రభుత్వ ఉద్యోగికి టోకరా ఇచ్చాడు. ఏకంగా రూ. 1.37 కోట్లు తీసుకొని మోసం చేశాడు. రామగుండం సైబర్ క్రైమ్ డీఎస్పీ ఎం.వెంకటరమణ తెలిపిన ప్రకారం.. రామగుండం పట్టణానికి చెందిన ఎండీ.అబ్దుల్ నయీమ్ నిర్మల్‌లో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఆరు నెలల కింద తన ఫ్రెండ్ శ్రీనివాస్ ద్వారా రామగుండం జెన్‌కోలో పని చేసే ఓ ఆఫీసర్ పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో నయీమ్ తన అవసరాల కోసం ఆఫీసర్ వద్ద రూ. లక్ష అప్పు తీసుకున్నాడు.
తర్వాత ‘డఫాబెట్’ అనే యాప్ ద్వారా ఆన్‌లైన్ గేమ్స్, షేర్ మార్కెట్‌లో డబ్బులు పెడితే ఎక్కువ సంపాదించొచ్చని ఆఫీసర్‌ను నమ్మించాడు. దీంతో సదరు ఆఫీసర్ నయీమ్ అకౌంట్‌తో పాటు అతడి భార్య అకౌంట్‌కు పలు దఫాలుగా డబ్బులు పంపించాడు. కొన్ని రోజుల తర్వాత ఆన్‌లైన్ గేమ్స్‌లో లాభం వచ్చిందంటూ ఎక్సైజ్ కానిస్టేబుల్ కొంత మొత్తం ఆఫీసర్‌కు ట్రాన్స్‌ఫర్ చేశాడు. మరిన్ని డబ్బులు పెడితే ఇంకా ఎక్కువ లాభం వస్తుందని నమ్మించడంతో ఆ ఆఫీసర్ నయీమ్, అతడి భార్య అకౌంట్‌కు రూ.1.37 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశాడు.
తర్వాత ఎక్సైజ్ కానిస్టేబుల్ నెల రోజుల నుంచి ఆఫీసర్‌కు డబ్బులు పంపించడం మానేశాడు. దీంతో అనుమానం వచ్చిన ఆఫీసర్ ఎక్సైజ్‌కానిస్టేబుల్‌ను డబ్బులు అడిగినా ఇవ్వలేదు. దీంతో మోసపోయానని గుర్తించిన సదరు ఆఫీసర్ ఈ నెల 24న రామగుండం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అబ్దుల్ నయీమ్ శనివారం మంచిర్యాల బస్టాండ్ వద్ద ఉన్నట్లు తెలుసుకొని అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.