పరంజా మీద నుంచి పడి భవన నిర్మాణ కార్మికుడు మృతి

హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లాలో మిషన్​భగీరథ వాటర్ ట్యాంక్​పనులు చేస్తున్న భవన నిర్మాణ కార్మికుడు పరంజా మీద నుంచి కింద పడి చనిపోయాడు. మరో కార్మికుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా అక్కంపేట, డక్కనూరుకు చెందిన ఎక్కలూరి రవి(30), గుడిల్ల రవి(26) మేస్త్రీ పనుల కోసం అక్కన్నపేట మండలం కట్కూరు వచ్చారు. ఎక్కలూరి రవి మేస్త్రీ కాగా, గుడిల్ల రవి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం వీరు కట్కూరులో వాటర్​ట్యాంక్​నిర్మాణ పనులు చేస్తున్నారు. ట్యాంకు నిర్మాణం దాదాపు పూర్తయింది. ప్రస్తుతం ప్లాస్టరింగ్​పనులు చివరి దశలో ఉన్నాయి.

రోజూలాగే సోమవారం పొద్దున 7.30కు కార్మికులు ఇద్దరూ సిమెంట్​మాల్​కలిపి సిద్ధం చేశారు. పైన కట్టిన పరంజా మీద నిలబడి కింది నుంచి పంపిస్తున్న మాల్​లాగే క్రమంలో ఒక్కసారిగా కింద పడిపోయారు. సమీపంలోని హనుమాన్​టెంపుల్​కు రంగులు వేస్తున్న కూలీలు గమనించి తీవ్రంగా గాయపడిన ఇద్దరిని హుస్నాబాద్​ప్రభుత్వ హాస్పిటల్​కు తరలించగా అప్పటికే ఎక్కలూరి రవి చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. గుడిల్ల రవి రెండు కాళ్లు విరిగిపోయాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్​తరలించారు.

అయితే మాల్​ను పైకి పంపించేందుకు కాంట్రాక్టర్ లిఫ్ట్ ఏర్పాటు చేయలేదని, కట్టెలకు గిరక పెట్టి, తాడును ట్రాలీ ఆటోకు కట్టి ముందుకు పోనిస్తే సిమెంట్ మాల్ డబ్బా పైకి వెళ్లేలా ఏర్పాటు చేశారని తెలిసింది. పరంజా మీద నిలబడి కూలీలు దానిని అందుకుని మేస్త్రీలకు ఇస్తుండగా ప్రమాదం జరిగింది. కాంట్రాక్టర్ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. మృతుడి సోదరుడు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు అక్కన్నపేట ఎస్సై వివేక్ తెలిపారు.